రెండేళ్ల కిందట బిగ్ బాస్ షోతో పాపులర్ అయిన వ్యక్తి నూతన్ నాయుడు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో కనిపించాడు. రాజకీయ వ్యవహారాల్లో కూడా అతడి పేరు వినిపించింది. ఈ మధ్య రామ్ గోపాల్ వర్మ మీద స్వీయ దర్శకత్వం, నిర్మాణంలో తెరకెక్కించిన పరాన్నజీవి సినిమాతో అతను మళ్లీ వార్తల్లోకి వచ్చాడు. అదే పనిగా పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేస్తున్న వర్మను టార్గెట్ చేస్తూ నూతన్ తీసిన సినిమా ఇది. జనాలకు ఇది పెద్దగా పట్టలేదన్నది వేరే విషయం. అయితే ఆ సందర్భంగా నూతన్ పవన్ వీరాభిమాని అని, జనసేన మద్దతుదారు అనే ముద్ర పడిపోయింది. కట్ చేస్తే.. ఇంట్లో పని మానేసినందుకు ఓ దళిత యువకుడికి ఇంట్లో శిరోముండనం చేయించిన దారుణ ఉదంతంతో ఇప్పుడు నూతన్ వార్తల్లోకి వచ్చాడు.
ఐతే ఇటీవలి పరాన్నజీవి సినిమా నేపథ్యంలో అతడికి, జనసేనకు ముడిపెట్టి.. ఆ పార్టీని నిందించే ప్రయత్నం జరుగుతోంది సోషల్ మీడియాలో. ఐతే ఆ సినిమాను పవన్ ఫ్యాన్స్, జనసేన మద్దతుదారులేమీ ఎండోర్స్ చేసింది లేదు. ఇదిలా ఉంటే.. నూతన్ ఒకప్పుడు ఇచ్చిన ఇంటర్వ్యూ క్లిప్ ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. తాను వైఎస్సార్ పార్టీ కోసం పని చేశానని.. జగన్ సోదరుడైన అనిల్ రెడ్డి సూచన మేరకు ఆ పార్టీ అజెండా, రాజ్యాంగం రాసే పనిలో క్రియాశీలకంగా వ్యవహరించాని.. ఆ పనిలో అత్యంత కీలక పాత్ర తనదే అని చెప్పుకున్నాడు ఆ వీడియోలో నూతన్. ఇతణ్ని జనసేన మనిషిగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్న అధికార పార్టీ వారికి జనసైనికులు ఈ వీడియోతో దీటుగా బదులిస్తున్నారు. దీనిపై వాదోపవాదాలు గట్టిగా నడుస్తున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates