తెలంగాణ ప్ర‌జ‌ల‌కు ఇది ‘మూడో ఉద్య‌మం’: రేవంత్‌

ప్ర‌స్తుత తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు మూడో ద‌ఫా ఉద్య‌మానికి రెడీ అయ్యార‌ని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇప్ప‌టికి తెలంగాణ ప్ర‌జ‌లు రెండు సార్లు ఉద్య‌మాలు చేశార‌ని చెప్పారు. ప్ర‌స్తుతం తెలంగాణ ఎన్నిక‌ల్లో ఆత్మ‌గౌర‌వం కోసం.. ఉద్య‌మించాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింద‌న్నారు. తాజాగా ఆయ‌న మీడియాతో మాట్లాడారు.

తొలి ద‌శ‌లో నిజాం దురహంకారానికీ, నియంతృత్వానికి వ్య‌తిరేకంగా తెలంగాణ ప్ర‌జలు ఉద్య‌మించార‌ని రేవంత్‌రెడ్డి చెప్పారు.ఈ క్ర‌మంలోనే సాయుధ రైతు పోరాటం తెర‌మీదికి వ‌చ్చింద‌న్నారు. ఇది నిజాం పాల‌న‌ను అంతం చేసింద‌ని వెల్ల‌డించారు. రెండో ద‌శ‌లో ఉమ్మ‌డి పాల‌కుల నిర్ల‌క్ష్యానికి, నీళ్లు-నిధులు-నియామ‌కాల కోసం స‌మాజం ఉద్య‌మం చేసింద‌న్నారు.

సమైక్య రాష్ట్రంలో సమాన అభివృద్ధి, సమాన అవకాశాలు దక్కలేదని.. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రజలను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూశారని, అందుకే స్వేచ్ఛ, సమానత్వం, సమాన అభివృద్ధి కోసం తెలంగాణ ప్రజలు ఉద్యమించారని, కొట్లాడి తెలంగాణ సాధించుకున్నామని అన్నారు. ఇక‌, ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ ఆధిపత్య ధోరణికి వ్య‌తిరేకంగా పోరాటం చేయాల్సి వ‌చ్చింద‌న్నారు.

తెలంగాణ ప్రజలు కోరుకున్న స్వేచ్ఛ, సమానత్వం, సమాన అభివృద్ధి అందలేదని రేవంత్ రెడ్డి అన్నారు. అందుకే మూడోసారి ఉద్యమించాల్సిన పరిస్థితి తెలంగాణలో ఏర్పడిందన్నారు. నిరంకుశ నిజాంకు పట్టిన గతే కల్వకుంట్ల కుటుంబానికి తెలంగాణ ప్రజలు రుచి చూపించబోతున్నారని రేవంత్ చెప్పారు. ప్రజలను బానిసలుగా చూస్తున్న కేసీఆర్‌ను గద్దె దించాలని పిలుపిచ్చారు.