ఖమ్మం జిల్లా రాజకీయాల్లో బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ వర్సెస్ కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. పువ్వాడ వేసిన నాలుగు సెట్ల నామినేషన్ లో తప్పులున్నాయని తుమ్మల ఆరోపించారు. పువ్వాడ నామినేషన్ రిజెక్ట్ చేయాల్సిందిగా ఎన్నికల అధికారిని కోరామని తుమ్మల నాగేశ్వరావు చెప్పారు. ఆర్ఓ నిబంధనలను పాటించడం లేదని, ఈ విషయంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానని తుమ్మల చెప్పారు.
బీఆర్ఎస్ అరాచకాలు, అక్రమాలు ఎక్కువైపోయాయని, చక్రవడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని తుమ్మల సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రమంతా ఒక పక్క ఖమ్మం జిల్లా ఓ పక్క అని, భీమవరంలో ఖమ్మం ఎన్నికలపై పందాలు కాస్తున్నారు అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు అని తుమ్మల అన్నారు. ఖమ్మం పౌరుషాల పురిటిగడ్డ అని, 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ప్రజల పరువు ప్రతిష్టల కోసం పని చేశానని గుర్తు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గత ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయారో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ని అడగాలని కేటీఆర్ పై తుమ్మల షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పదికి పది స్థానాల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలని తుమ్మల ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఖమ్మం జిల్లాలో అరాచక, అవినీతి, అక్రమ కేసులు లేకుండా ప్రశాంతంగా ఉండాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని తుమ్మల పిలుపునిచ్చారు. మత విద్వేషాలు లేకుండా దేశమంతా భారత్ జోడో యాత్ర చేసిన రాహుల్ గాంధీ నాయకత్వానికి మద్దతుగా నిలవాలని కోరారు. తనతో పాటు పొంగులేటిని ఓడించాలని అధికార యంత్రాంగం మొత్తాన్ని అధికార పార్టీ నేతలు వాడుతున్నారని ఆరోపించారు.