మొదటినుండి కేసీయార్ కు ఈ జిల్లా రాజకీయాలు ఏమాత్రం మింగుడుపడటంలేదు. ప్రత్యేక తెలంగాణా ఉద్యమ సమయంలోనే ఉద్యమం తాలూకు ప్రభావం ఏమాత్రం కనబడలేదు. ఇంతకీ ఆ జిల్లా ఏదనుకుంటున్నారా ? అదే ఖమ్మం జిల్లా. అలాంటి జిల్లాపైన రాబోయే ఎన్నికలకు సంబంధించి కేసీయార్ ప్రత్యేక దృష్టిపెట్టారు. పది నియోజకవర్గాల్లో కనీసం మూడు నియోజకవర్గాల్లో అయినా బీఆర్ఎస్ గెలుస్తుందా అనే చర్చలు జనాల్లో పెరిగిపోతున్నాయి.
ఈరోజు కేసీయార్ దమ్మపేట, బూర్గంపాడు మండలాల్లో బహిరంగసభల్లో పాల్గొనబోతున్నారు. ఇప్పటికే పాలేరు, సత్తుపల్లి, ఖమ్మం, కొత్తగూడెం నియోజకవర్గాల్లో పాల్గొన్నారు. కేసీయార్ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా బీఆర్ఎస్ ను ఖమ్మం జిల్లా ఎందుకనో ఆదరించటంలేదు. అందుకనే డైరెక్టుగా లాభంలేదని అనుకుని ప్రలోభాలకు గురిచేసి ఎంఎల్ఏలను లాక్కున్నారు. మంత్రి పువ్వాడ అజయ్, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంఎల్ఏలు సండ్ర వెంకటవీరయ్య, మెచ్చా నాగేశ్వరరావు, వనమా వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళని లాక్కున్నారు.
తుమ్మల నాగేశ్వరరావును బీఆర్ఎస్ లో చేర్చుకున్నారు. ఇన్ని ప్రలోభాలకు గురిచేసి, ఇంతమందిని చేర్చుకుని, లాక్కుంటే అప్పుడు పార్టీ యాక్టివ్ గా కనబడింది. అయితే అదంతా తాజా ఎన్నికల్లో నీరుగారిపోయింది. తుమ్మల, పొంగులేటి లాంటి వాళ్ళు బీఆర్ఎస్ ను వదిలేసి కాంగ్రెస్ లో చేరటంతో బీఆర్ఎస్ బాగా దెబ్బతినేసింది. రేపటి ఎన్నికల్లో మంత్రి పువ్వాడ ఖమ్మంలో గెలవటమే కష్టమంటున్నారు. పది నియోజకవర్గాల్లో మహాయితే సత్తుపల్లిలో బీఆర్ఎస్ గెలిచే అవకాశముందనే ప్రచారం పెరిగిపోతోంది. ఇదంతా చూస్తుంటే మొదటినుండి ఖమ్మం జిల్లా కేసీయార్ కు మింగుడుపడటంలేదన్న విషయం అర్ధమైపోతోంది.
దీనికి కారణం ఏమిటంటే ఈ జిల్లాపైన ఉద్యమ ప్రభావం ఏమాత్రం పడలేదు. కృష్ణా, గోదావరి జిల్లాలకు దగ్గరగా ఉండటంతో ఈ జిల్లాల ప్రభావమే ఖమ్మం జిల్లాపైన ఎక్కువుంది. వ్యాపారాలు, పెళ్ళిళ్ళతో పాటు ఏ అవసరం వచ్చినా జిల్లాలో జనాలు ఎక్కువగా విజయవాడ, ఏలూరుకు వెళిపోతారు. రెండు వరుస ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభావం పెద్దగా కనబడలేదనే చెప్పాలి. అయినా సరే కేసీయార్ ఇపుడు వరుస బహిరంగసభల్లో పట్టుసాధించేందుకు ఏదో ప్రయత్నం చేస్తున్నారు. మరి చివరకు ఏమవుతుందో చూడాలి.