14 నుంచి రోజుకొకరి అవినీతి బట్టలు విప్పదీస్తారట!

జనసేన మాస్ వార్నింగ్ ఇచ్చేసింది. ఏపీ ముఖ్యమంత్రి మొదలు రాష్ట్ర మంత్రుల వరకు రోజుకొకరి అవినీతి బట్టలు విప్పదీసే కార్యక్రమాన్ని చేపడతామని వెల్లడించింది. నాలుగున్నరేళ్ల కాలంలో చేసిన పాపాల చిట్టాను బయట పెడతామని.. కుంభకోణాల్ని ఆధారాలతో సహా వెల్లడిస్తామంటూ హెచ్చరించిన వైనం సంచలనంగా మారింది. ఈ కార్యక్రమాన్ని ఈ నెల పద్నాలుగు నుంచి మొదలు పెట్టనున్నట్లుగా పేర్కొంది.

ప్రజాకోర్టులో సమాధానం చెప్పటానికి సిద్ధంగా ఉండాలన్న జనసేన.. తమ షెడ్యూల్ లో భాగంగా మొదట మంత్రి సీదిరి అప్పలరాజు అవినీతిని బయటపెడతామని పేర్కొన్నారు. ఇటీవల పాలవెల్లువ కార్యక్రమంలో రూ.2887 కోట్ల అవినీతి జరిగిందని తాము ఆరోపణలు చేశామని.. దాని మీద మంత్రి స్పందించటానికి పది రోజులు పట్టిందన్న జనసేన.. అప్పుడు కూడా నోటికి వచ్చినట్లుగా మాట్లాడి వ్యక్తిగత దూషణలతో సరిపెట్టారే తప్పించి.. తాము చేసిన ఆరోపణల మీద మాత్రం మాట దాటేశారన్నారు.

తాము మూడు ప్రశ్నలు అడిగితే.. వాటికి సమాధానాలు ఇవ్వకపోవటాన్ని ప్రశ్నించారు. తాము అడిగిన ప్రశ్నల్ని మరోసారి రిపీట్ చేసిన జనసేన వేసిన ప్రశ్నల్ని చూస్తే..

  • పశువుల కొనుగోలు విషయంలో ఇద్దరు మంత్రులు చెప్పిన సంఖ్యలో తేడా ఎందుకు వచ్చింది?
  • అసలు ఎవరు చెప్పింది నిజం?
  • మంత్రి చెప్పినట్లుగా 3.94 లక్షల పశువుల్ని కొనుగోలు చేసి ఉంటే పాల ఉత్పత్తి ఎందుకు పెరగలేదు?
  • పశువుల కొనుగోలు విషయంలో అవినీతే జరగకుంటే లబ్థిదారుల వివరాల్ని ఎందుకు బయటపెట్టటం లేదు?
  • పాల వెల్లువ పథకంలో భాగంగా అమూల్ డెయిరీ నుంచి 2.72లక్షల లీటర్ల పాలను సేకరించి పంపుతున్నట్లుగా గొప్పలు చెప్పారు. నిజంగానే అన్ని పశువుల్ని కొని ఉంటే.. 22 లక్షల లీటర్లకు పైగా పాల ఉత్పత్తి జరగాలి. మరేమైంది?
    నవంబరు14న వైసీపీ సర్కారు గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా మంత్రి సీదిరి చేసిన మరో కుంభకోణం వివరాల్ని వెల్లడిస్తామని చెప్పారు. అంబులెన్సుల పేరుతో జరిగిన అవినీతిని బయటపెడతామని చెప్పిన జనసేన.. అనంతరం ముఖ్యమంత్రి నుంచి మంత్రుల చిట్టాను రోజుకు ఒకటి చొప్పున బయటపెట్టనున్నట్లుగా పేర్కొన్నారు. జనసేన ఇస్తున్న తాజా హెచ్చరికకు అధికార పక్షం ఎలా రియాక్టు అవుతుందో చూడాలి