కేసీయార్ కు షాకేనా ?

ముగిసిన నామినేషన్ల ఘట్టాన్ని చూస్తే రెండు ఇంట్రస్టింగ్ పాయింట్లు కనిపించాయి. ఈ రెండు కూడా కేసీయార్ కు షాకిచ్చేట్లుగానే ఉండటం మరింత ఇంట్రెస్టింగుగా ఉంది. ఇంతకీ విషయం ఏమిటంటే 10వ తేదీతో నామినేషన్ల ఘట్టం ముగిసిన విషయం తెలిసిందే. దాఖలైన నామినేషన్లలో అత్యధికంగా గజ్వేలు, కామారెడ్డి నియోజకవర్గాల్లోనే దాఖలయ్యాయి. ఈ రెండింటినే ఎందుకింత హైలైట్ చేస్తున్నారంటే ఈ రెండుచోట్ల కేసీయార్ పోటీ చేస్తున్నారు కాబట్టే. కేసీయార్ కు వ్యతిరేకంగా నామినేషన్లు వేయటానికి కొన్ని వర్గాలు గతంలోనే డిసైడ్ అయ్యాయి.

అప్పట్లో చెప్పినట్లుగానే ఇపుడు నామినేషన్లు పడ్డాయి. గజ్వేల్ లో 154 నామినేషన్లు దాఖలవ్వవగా కామారెడ్డిలో 102 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిల్లో అత్యధికం కేసీయార్ కు వ్యతేకంగా దాఖలైనవే అనటంలో సందేహం లేదు. వీటిల్లో కూడా కుల సంఘాలు, రైతు సంఘాలు, బాధిత సంఘాల్లోని వాళ్ళు దాఖలు చేసిన నామినేషన్లే ఎక్కువగా ఉన్నాయి. తాజా నామినేషన్ల దాఖలులో నిరుద్యోగ సంఘాలు, అమరవీరుల కుటుంబాల వాళ్ళు కూడా ఉన్నారు.

2018 ఎన్నికల్లో 23 మంది నామినేషన్లు దాఖలు చేస్తే చివరకు 13 మంది పోటీలో నిలబడ్డారు. అప్పట్లో కేసీయార్ విజయం నల్లేరు మీద నడకలాగ సాగిపోయింది. ఎందుకంటే కేసీయార్ పైన వ్యతిరేకతతో పెద్దగా ఎవరు నామినేషన్లు దాఖలుచేయలేదు. కానీ ఇపుడు పరిస్ధితి పూర్తిగా మారిపోయింది. ఐదేళ్ళల్లో గజ్వేలులో కేసీయార్ పై చాలా వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత పెరిగిపోయిందని అంటున్నారు. అలాగే కామారెడ్డిలో పోయిన ఎన్నికల్లో 9 మంది నామినేషన్లు వేస్తే ఇపుడు 102 మంది దాఖలు చేశారు.

రెండు నియోజకవర్గాల్లో కూడా ఇంతమంది నామినేషన్లు వేయనీయకుండా బీఆర్ఎస్ నేతలు చాలా ప్రయత్నాలు చేశారు. అయితే కేసీయార్ మీద మండిపోతున్న వివిధ వర్గాలు లోకల్ నేతల మాటలను పట్టించుకోలేదు. కామారెడ్డి మున్సిపాలిటి మాస్టర్ ప్లాన్ పేరుతో తమ భూములను ప్రభుత్వం ఏకపక్షంగా లాగేసుకోవటంతో రైతులు మండిపోతున్నారు. అలాగే గల్ఫ్ దేశాల్లో కార్మికులు, ఉద్యోగులు చనిపోతున్నా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవటంలేదు. గల్ఫ్ బాధితుల కుటుంబాల ఓట్లే కనీసం 30 వేలుంటాయని అంచనా. వీళ్ళంతా కేసీయార్ మీద వ్యతిరేకతతోనే నామినేషన్లు వేశారు. గజ్వేలులో కూడా సేమ్ టు సేమ్. మరి చివరకు ఏమవుతుందో చూడాలి.