నిన్న మొన్నటి వరకు ఏపీ రాజకీయాలకే పరిమితమైన జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాజాగా తెలంగాణ రాజకీయాలలో యాక్టివ్ అయిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లో నిన్న జరిగిన బీసీల ఆత్మగౌరవ సభలో ప్రధాని మోదీతో కలిసి పాల్గొన్న పవన్ కల్యాణ్…బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం సంచలనం రేపింది. ఈ క్రమంలోనే తాజాగా పవన్ కల్యాణ్ పై బీఆర్ఎస్ నేతలు కూడా ఎదురుదాడికి దిగారు. ఈ నేపథ్యంలోనే జనసేనాని పవన్ పై మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
కేసీఆర్ ఓ ఏకే 47 వంటివాడని, ఆయన ముందు డీకేలు, పీకేలు పని చేయరని…కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లనుద్దేశించి మంత్రి హరీష్ రావు షాకింగ్ కామెంట్లు చేశారు. రాష్ట్రంలో తెలంగాణ ద్రోహులంతా ఒక్కటవుతున్నారని పవన్, వైఎష్ షర్మిల నుద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి పవన్, కాంగ్రెస్‌కు షర్మిల అండగా ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎన్నికల బరిలో దిగినపుడు పోటీ సహజమని, గజ్వేల్, కామారెడ్డిలో కేసీఆర్‌పై ఎవరు పోటీ చేసినా స్వాగతిస్తామని ఈటల, రేవంత్ లనుద్దేశించి వ్యాఖ్యానించారు. కేసీఆర్‌పై పోటీ పేరుతో కొందరు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని, పెద్దవారిపై పోటీ చేసి పెద్దవారు అనుకుంటున్నారని చురకలంటించారు. తెలంగాణలో కేసీఆర్ కు సరితూగే నాయకుడు లేరని, ఎంతో కష్టపడి తెలంగాణను తెచ్చిన ఘనత కేసీఆర్ దేనని చెప్పారు. బీఆర్ఎస్‌ను గెలిపిస్తే గజ్వేల్ పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates