ఇప్పుడంత ఈజీకాదు.. చెమ‌టోడ్చ‌క త‌ప్ప‌దు నాయ‌కా!

ఇన్నిచ్చాం.. అన్నిచ్చాం.. ఏదేదో చేసేశాం.. అని చెప్పుకొని మెప్పుపొంది గాలివాటంగా ప్ర‌చారం చేసుకు నే ప‌రిస్థితి ఇప్పుడు క‌నిపించ‌డం లేదు. మా నేతే అని ఓట్లు గుద్దేసే ప‌రిస్థితి కూడా ఇప్పుడు ప్ర‌జ‌ల్లో క‌నిపించ‌డం లేదు. మొత్తంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో నాయ‌కుల జాత‌కాలు మార్చేది.. మారేదీ.. చెమ‌టోడిస్తేనే అని అంటున్నారు ప‌రిశీల‌కులు. నిజానికి 2018లో సెంటిమెంటు రాజేసి విజ‌య తీరం చేరిన బీఆర్ ఎస్‌కు.. ఇప్పుడు పెద్ద‌గా సెంటిమెంటు అస్త్రాల‌వీ క‌నిపించ‌డం లేదు.

క‌నిపించినా.. ప్ర‌జ‌లు విశ్వ‌సిస్తార‌ని.. వెంట‌నే ఓట్లు గుద్దేస్తార‌ని చెప్పే ప‌రిస్థితి కూడా క‌నిపించ‌డం లేదు. అంటే.. మొత్తంగా సెంటిమెంటును రాజేసే ప్ర‌య‌త్నాలు కూడా స‌ఫ‌ల‌మ‌య్యే ప‌రిస్థితి లేదు. ఇక‌, కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితి కూడా ఇంచుమించు ఇలానే ఉంది. నాయ‌కుల మ‌ధ్య స‌ఖ్య‌త లేమి.. అధిష్టానం వైఖ‌రి.. జంపింగులు.. చేరిక‌లు వంటి అనేక స‌మ‌స్య‌లు కాంగ్రెస్‌ను చుట్టుముట్టాయి. దీంతో గ‌తంలో మాదిరిగా తెలంగాణ ఇచ్చేశాం.. కాబ‌ట్టి మాకు ఓటేయండి అని అడుగుతున్నా.. ఆమేర‌కు ప్ర‌జ‌ల నుంచి స్పంద‌న క‌నిపించ‌డం లేదు.

పోనీ.. అలాగ‌ని ప్ర‌జ‌లు కాంగ్రెస్‌ను ప‌ట్టించుకోవ‌డం లేదా.. అంటే.. అదేం లేదు. కాంగ్రెస్ విష‌యంలో అయినా.. ప‌దేళ్లుగా పాల‌న చేస్తున్న బీఆర్ ఎస్ విష‌యంలో అయినా.. ప్ర‌జ‌లు ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తు న్నారు. అభ్య‌ర్థుల విష‌యంలో అత్యంత అప్ర‌మ‌త్తంగా.. పార్టీల విష‌యంలోనూ అదే జాగ్ర‌త్త‌గా ఉంటున్నారు. ఈ విష‌యాలే.. అనేక స‌ర్వేల్లో స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. ఏ ఒక్క పార్టీకీ పూర్తిగా ప్ర‌జ‌లు అండ‌గా ఉన్న ప‌రిస్థితి లేదు. అలాగ‌ని ఏ పార్టీనీ వారు విస్మ‌రించ‌డం లేదు.

ఇప్ప‌టి వ‌ర‌కు వ‌చ్చిన స‌ర్వేఫ‌లితాలు చూస్తే.. అన్ని పార్టీలూ.. అది తెలంగాణ తెచ్చిన పార్టీ అయినా.. ఇచ్చిన పార్టీ అయినా.. చివ‌ర‌కు చిన్నా చిత‌కా ఏ పార్టీ అయినా.. చెమ‌టోడ్చాల్సిన ప‌రిస్థితి.. క్ష‌ణం తీరిక లేకుండా.. ప్ర‌జ‌ల‌కు చేరువ కావాల్సిన ప‌రిస్థితి.. వారి మ‌న‌సులు గెలుచుకోవాల్సిన ప‌రిస్థితిని ఈ స‌ర్వే లు స్ప‌ష్టం చేస్తున్నాయి. ఎక్క‌డ ఏమాత్రం ఎవ‌రు అప్ర‌మ‌త్తంగా లేక‌పోయినా.. ప‌క్క‌పార్టీ బ‌లోపేతం కావ‌డం ఖాయ‌మ‌నే సంకేతాలు ఈ స‌ర్వే ఫ‌లితాల్లో స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. అందుకే.. ఇప్పుడు ఏ నేతను ప‌ల‌క‌రించినా.. చెమ‌టోడ్చ‌క త‌ప్ప‌దు గురూ! అనే మాటే వినిపిస్తోంది.