కేసీఆర్ హ్యాట్రిక్ కొడతారంటోన్న‘జనతా కా మూడ్’

తెలంగాణ ఎన్నికలలో మరోసారి బీఆర్ఎస్ కే అధికారం దక్కబోతోందని ‘జనతా కా మూడ్’ సంస్థ ఎగ్జిట్ పోల్స్ నివేదికలో వెల్లడించింది. కేసీఆర్ కే ప్రజలు పట్టం కట్టబోతున్నారని, సీఎంగా కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టబోతున్నారని ఆ సర్వేలో వెల్లడైంది. తెలంగాణలో అధికార పార్టీకి 72 నుంచి 75 స్థానాలు వస్తాయని, కాంగ్రెస్ పార్టీ 31 నుంచి 36 స్థానాలకే పరిమితమై ప్రతిపక్ష హోదా దక్కించుకుంటుందని తేలింది. ఇక, బిజెపి కేవలం 7 నుంచి 9 స్థానాలకే పరిమితం కానుందట. ఎంఐఎంకు 4 నుంచి 6 స్థానాలు వచ్చే అవకాశం ఉందని ఆ సర్వే తెలిపింది.

బీఆర్ఎస్ కు 41% ఓట్లు పడతాయని, కాంగ్రెస్ కు 34 శాతం ఓట్లు, బిజెపికి 14 శాతం ఓట్లు వస్తాయని ఆ సంస్థ ప్రకటించింది. తెలంగాణవ్యాప్తంగా 1,20,000 శాంపిళ్లను తీసుకొని పకడ్బందీగా సర్వే నిర్వహించామని ఆ సంస్థ వెల్లడించింది. 2015, 2016, 2017లో ఉత్తర ప్రదేశ్, అస్సాం తదితర రాష్ట్రాల్లో జరిగిన శాసనసభ ఎన్నికల ఫలితాలు ఈ సంస్థ సర్వే ఫలితాలు దాదాపుగా మ్యాచ్ కావడం విశేషం.

కాగా, దేశవ్యాప్తంగా తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న రాష్ట్రాలలో ఎగ్జిట్ పోల్స్ పై సీఈసీ నిషేధం విధించింది. నవంబర్ 7వ తేదీ ఉదయం 7 గంటల నుంచి నవంబర్ 30వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుందని తెలిపింది ఈ నేపథ్యంలోనే ఆల్రెడీ ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలపై సర్వే చేసిన కొన్ని సంస్థలు తమ నివేదికలను ఏడో తేదీ లోపు బహిర్గతం చేసేందుకు ఏర్పాటు చేస్తున్నాయి ఈ నేపథ్యంలోనే తాజాగా జనతా కా మూడ్ సర్వే ఫలితాలను వెల్లడించింది.