రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు హైకోర్టు మధ్యంత బెయిల్ మంజూరు చేయడంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. ఈ క్రమంలో రోడ్డు మార్గంలో రాజమండ్రి నుంచి గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఉండవల్లికి బయలు దేరారు. చంద్రబాబు జడ్ + కేటగిరీ భద్రతలో ఉండడంతో ఆ మేరకు పోలీసులు ఏర్పాట్లు చేశారు. అయితే, పార్టీ నాయకుల పిలుపు మేరకు ఎక్కడికక్కడ ప్రజలు చంద్రబాబుకు ఘన స్వాగతం పలికేందుకు బారులు తీరారు.
రాజమండ్రి నుంచి చంద్రబాబు వేమగిరి, రావులపాలెం, పెరవలి, తణుకు, తాడేపల్లిగూడెం, భీమడోలు, దెందులూరు, ఏలూరు, హనుమాన్ జంక్షన్, గన్నవరం, విజయవాడ మీదుగా ఉండవల్లిలోని నివాసానికి చేరుకుంటారు. అయితే, జైలు నుంచి బయటకు వచ్చిన చంద్రబాబును చూడగానే జై బాబు నినాదాలతో అభిమానులు హోరెత్తించారు. పోలీసుల ఆంక్షలను ఛేధించుకొని వేలాదిగా తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలు జైలు వద్దే ఆయనకు ఘనంగాస్వాగతం పలికారు. 52 రోజుల తర్వాత బయటకు వచ్చిన చంద్రబాబునాయుడు పై ఉప్పొంగిన అభిమానంతో హర్షాతిరేకం వ్యక్తం చేశారు.
ఇక, చంద్రబాబు వస్తున్న కాన్వాయ్ రోడ్ మ్యాప్ మేరకు దారిపొడవునా చంద్రబాబును చూసేందుకు ప్రజలు బారులు తీరారు. రాజమండ్రి సహా కాన్వాయ్ ప్రయాణించే ప్రధాన రహదారులపై టీడీపీ నాయకులు భారీ ఎత్తున బ్యానర్లు కట్టారు. అంతేకాదు.. ప్రధాన కూడళ్లలో వందల సంఖ్యలో అభిమానులు ఆయన కోసం వేచి ఉన్నారు. చంద్రబాబు నినాదాలతో రావుల పాలెం సెంటర్ మార్మోగింది. ఇక, తాడేపల్లి, భీమడోలు, దెందులూరు, ఏలూరు, గన్నవరం, విజయవాడల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున చంద్రబాబు కోసం ఎదురు చూస్తుండడం గమనార్హం. బాస్ ఈజ్ బ్యాక్ నినాదాలతో హోరెత్తించడంతోపాటు.. జై బాబు నినాదాలు చేస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates