టీడీపీకి కాసాని గుడ్ బై… బాబుకు సూటి ప్ర‌శ్న‌

తెలుగుదేశం పార్టీకి ఇంకో షాక్ త‌గిలింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయ్యి జైలులో ఉన్న టీడీపీ అధ్య‌క్షుడు చంద్రబాబును మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులిచ్చారన్న ఆరోపణలతో ఏపీ ప్ర‌భుత్వం కేసును నమోదు చేసిన రోజే… ఇటు తెలంగాణ‌లోనూ కీల‌క ప‌రిణామం సంభ‌వించింది. తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవికి కాసాని జ్ఞానేశ్‌ రాజీనామా చేశారు. ఈ మేర‌కు నేడు ఆయ‌న త‌న నిర్ణ‌యం వెల్ల‌డించారు.

తెలంగాణలో ప్ర‌స్తుతం జ‌రుగుతున్న అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా ఉండాలని పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నిర్ణయించిన నేపథ్యంలో మనస్థాపంతో రాజీనామా చేస్తున్న‌ట్లు కాసాని ప్ర‌క‌టించారు. ఎన్నికల్లో పోటీ చేయనివ్వకపోవడానికి కారణాలను చంద్రబాబు చెప్పడం లేదని పేర్కొన్నారు. పార్టీ బ‌లోపేతం కోసం తాను ఎంతో కృషి చేశాన‌న్నారు. చంద్రబాబు కోరితేనే ఖమ్మంలో మీటింగ్‌ను ఏర్పాటు చేశానని, తర్వాత నిజామాబాద్‌లో మీటింగ్‌ పెట్టాలని సూచించినట్లు పేర్కొన్నారు. ఇంటింటికీ టీడీపీ అని, 41వ ఆవిర్భావ సభను పెట్టించారన్నారు. అయిన‌ప్ప‌టికీ తెలంగాణ‌లో బ‌రిలో దిగ‌కూడ‌దంటూ త‌మ‌ను ఆదేశించార‌ని కాసాని వాపోయారు.

తెలుగుదేశం పార్టీ డ‌బ్బులు స‌మీక‌రించ‌క‌పోయినా కూడా అభ్యర్థులు సొంత డబ్బులు పెట్టుకొని ఎన్నికల్లో నిలబడాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపిన కాసాని ఇలాంటి స‌మ‌యంలో ఎన్నికల్లో నిలబడడం లేదని చంద్ర‌బాబు చెప్ప‌డం త‌న‌ను బాధించింద‌న్నారు. చంద్రబాబును జైలులో కలిసి తనను పార్టీలోకి ఎందుకు పిలిచారని చంద్రబాబును ప్రశ్నించానని వెల్ల‌డించారు. లోకేశ్‌కి ఫోన్‌ చేస్తే కూడా లిఫ్ట్‌ చేయలేదని కాసాని వాపోయారు. అభ్యర్థులు సిద్ధంగా ఉన్న స‌మ‌యంలో ఇలా జ‌ర‌గ‌డం బాధాక‌ర‌మ‌న్నారు. క్యాడర్‌కు పార్టీలో ఉండి న్యాయం చేయలేనన్నారు. టీడీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నానని.. క్యాడర్‌తో సమావేశమై భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. కాగా, ఆయ‌న అడుగులు బీఆర్ఎస్ వైపేన‌ని అంచ‌నాలు వెలువ‌డుతున్నాయి.