టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుతో టీడీపీ కార్యకర్తలు, చంద్రబాబు అభిమానులు షాక్ కి గురైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చంద్రబాబు అక్రమ అరెస్టు వార్తలు తట్టుకోలేక కొంతమంది కార్యకర్తలు గుండెపోటుతో హఠాన్మరణం పాలయ్యారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక మరణించిన టీడీపీ కార్యకర్తల కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు నారా భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ యాత్రను చేపట్టారు. ఈ రోజు మొదలైన ఈ యాత్ర తొలి రోజున చంద్రగిరి నియోజకవర్గంలో ఆమె పర్యటించారు. ఇద్దరు టీడీపీ కార్యకర్తల కుటుంబ సభ్యులను ఆమె పరామర్శించి ఆర్థిక సాయం చేశారు.
అంతకుముందు, నారావారిపల్లెలో తండ్రి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించిన తర్వాత ఈ కార్యక్రమాన్ని భువనేశ్వరి ప్రారంభించారు. అనంతరం చంద్రగిరిలో పర్యటించిన భువనేశ్వరి ప్రవీణ్ రెడ్డి, కనుమూరు చిన్నప్ప నాయుడుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా భువనేశ్వరి ఎమోషన్ అయ్యారు. పార్టీ కార్యకర్తలు చనిపోయినప్పుడు ఎంతో బాధ వేసిందని, వారి కుటుంబ సభ్యులను కలిసి భరోసానివ్వడం తమ బాధ్యత అని భువనేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు.
కార్యకర్తలు చనిపోయిన విషయం తెలుసుకున్న చంద్రబాబు ఎంతో మనోవేదనకు గురయ్యారని, బాధపడ్డారని అన్నారు. చంద్రబాబు జైల్లో ఉన్నా ఆయన మనసంతా టీడీపీ కార్యకర్తలు, ప్రజలపైనే ఉందన్నారు. కుటుంబం కంటే కార్యకర్తలపైనే చంద్రబాబుకు ధ్యాస ఎక్కువ అని చెప్పారు. ప్రవీణ్ రెడ్డి, చిన్నప్ప నాయుడుల మృతి బాధాకరమని అన్నారు. ప్రవీణ్ రెడ్డి చనిపోయిన రెండు రోజుల తర్వాత ఆయనకు బిడ్డ పుట్టినట్టుగా తెలిసిందని, బిడ్డను చూసుకునే అదృష్టం ప్రవీణ్ రెడ్డికి లేనందుకు బాధగా ఉందని అన్నారు.తల్లిదండ్రులకు కొడుకుగా ప్రవీణ్ రెడ్డి అండగా ఉన్న విధంగానే పార్టీ కూడా అండగా ఉంటుందని చెప్పారు. ప్రవీణ్ రెడ్డి, చిన్నప్పల కుటుంబ సభ్యులకు 3 లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని భువనేశ్వరి అందించారు.