రాజమండ్రి జైలు ఎదురుగా ఉన్న మంజీరా హోటల్‌లో టీడీపీ-జనసేన సమన్వయ కమిటీ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమావేశానికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో పాటు ఇరు పార్టీలకు చెందిన పలువురు కీలక నేతలు పాల్గొన్నారు. ఈ భేటీలో వారాహి యాత్ర, భవిష్యత్తుకు గ్యారెంటీ, నిజం గెలవాలి యాత్రలపై చర్చించారు. సీట్ల పంపకాలు తప్ప మిగతా అంశాలపై ప్రాధమికంగా ఒక అవగాహనకు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు.
దసరా నాడు ఇరు పార్టీల నేతలు భేటీ కావడం రాష్ట్రానికి మేలు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో మూడు తీర్మానాలు చేశామని లోకేష్ వెల్లడించారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్ కు నిరసనగా ఒక తీర్మానం, వైసీపీ అరాచక పాలన నుండి ప్రజలను రక్షించాలని రెండో తీర్మానం, రాష్ట్రాభివృద్ది కోసం టీడీపీ-జనసేన కలిసి పోరాటం చేయాలని మూడో తీర్మానం చేశామని లోకేష్ అన్నారు. నవంబర్ 1వ తేదీన టీడీపీ-జనసేన ఉమ్మడి కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే వేధింపులకు గురి చేస్తున్నారని, తప్పు చేయని చంద్రబాబును జైలులో ఉంచారని అన్నారు. వ్యవస్థలను మేనేజ్ చేసి ప్రతిపక్ష నేతల గొంతు నొక్కుతున్నారని లోకేష్ ఆరోపించారు. ప్రజా సమస్యళ పరిష్కారినికే రెండు పార్టీల నేతలు సమావేశమయ్యామని అన్నారు. నాలుగేళ్లలో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా రాలేదని, ఉద్యోగాల కోసం యువత పక్క రాష్ట్రాలకు వలస వెళుతున్నారని అన్నారు.