అంబ‌టిపై హైకోర్టులో వైసీపీ నేత‌ల ఫిర్యాదు

Ambati Rambabu

ఏపీ హైకోర్టులో మ‌రోమారు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాక్ త‌గిలింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియ‌ర్ నేత‌, సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబుపై అదే పార్టీకి చెందిన నేత‌లు హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. అంబ‌టి రాంబాబు అక్రమ మైనింగ్ చేస్తున్నారంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు. రాజుపాలెం వైసీపీ కార్యకర్తల తరపున హైకోర్టు న్యాయవాది ఎం.నాగరఘు ప్రజా ప్రయోజవ్యాజ్యం దాఖలు చేశారు.

రాజుపాలెం మండలం కోట నెమలిపురి, కొండమోడులో అక్రమ మైనింగ్ జరిగిందని ఈ పిటిషన్లో ఫిర్యాదు దారులు పేర్కొన్నారు. కలెక్టర్, మంత్రి పెద్దిరెడ్డి, సీఎం వైఎస్‌ జగన్‍ మోహ‌న్ రెడ్డి పిటిషన్లు పంపినా పట్టించుకోలేదని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇప్పటికే మైనింగ్ అధికారులు విచారణ జరిపారని పిటిషనర్లు పేర్కొన్నారు. వైసీపీ కార్యకర్తలు వేస్తే ప్రజాప్రయోజన వ్యాజ్యం ఎలా అవుతుందని హైకోర్టు ప్ర‌శ్నించింది. కోర్టుకు పూర్తి వివరాలు చెప్పాల్సిన భాధ్యత తనపై ఉందని న్యాయవాది నాగరఘు పేర్కొన్నారు. మంత్రి పెద్దిరెడ్డి విచారణ జరపాలని ఆదేశించినా పట్టించుకోలేదని న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువ‌చ్చారు.

కాగా, వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే అంబ‌టి రాంబాబు అక్రమ మైనింగ్‌కు పాల్ప‌డుతున్నార‌నే ఆరోప‌ణ‌లపై వెంటనే నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ న్యాయవాదికి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. హైకోర్టు కేసు విచారణ వచ్చే నెలకు వాయిదా వేసింది. కాగా, సాక్షాత్తు వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేపై సాక్షాత్తు పార్టీ నేత‌లే ఫిర్యాదు చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది.