నిజమే… ముచ్చటపడి కట్టుకున్న రాజప్రసాదం లాంటి భవంతిలో జగన్ అడుగు పెట్టి చాలా కాలమే అయ్యింది. చాలా కాలమే అంటే… ఏదో కొన్ని రోజులు అనుకునేరు. రోజులు కాదు మూడేళ్లకు పైగానే జగన్ అక్కడ అడుగుపెట్టింది లేదు. అయితే బుధవారం మొత్తం ఆయన సదరు భవంతిలోనే బస చేశారు. ఎలాంటి అధికారిక కార్యక్రమాలు లేకుండానే బుధవారమంతా జగన్ సదరు భవంతిలో విశ్రాంతి తీసుకున్నారు. మొత్తం కుటుంబ సభ్యులందరితో కలిసి బెంగళూరు వెళ్లిన జగన్… తన సొంతింటిలోనే సేదదీరారు.
తన పెద్ద కుమార్తె హర్షారెడ్డి ఉన్నత విద్య కోసం పారిస్ లోని టాప్ బిజినెస్ స్కూల్ ఇన్సీడ్ లో మాస్టర్స్ డిగ్రీ చేసేందుకు అర్హత సాధించిన సంగతి తెలిసిందే. ఇటీవలే లండన్ స్కూల్ ఆప్ ఎకనామిక్స్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన హర్షారెడ్డి… మాస్టర్స్ కోసం ఇన్సీడ్ కు వెళుతున్నారు. ఆమెను సాగనంపేందుకు జగన్ తన కుటుంబ సభ్యులందరితో కలిసి మంగళవారం రాత్రికే బెంగళూరు చేరుకున్న సంగతి తెలిసిందే. గురువారం తెల్లవారుజామున హర్షా రెడ్డి బెంగళూరులోనే పారిస్ ఫ్లైట్ ఎక్కనున్నారు. ఆమెకు అక్కడ వీడ్కోలు పలికిన తర్వాత జగన్ ఫ్యామిలీ తిరిగి తాడేపల్లి చేరుకుంటుంది.
ఈ క్రమంలో మంగళవారం సాయంత్రానికే బెంగళూరు చేరుకున్న జగన్… విమానాశ్రయం నుంచి నేరుగా కెంపేగౌడలోని తన భవంతికి చేరుకున్నారు. మంగళవారం రాత్రి అందులోనే రెస్ట్ తీసుకున్న జగన్… బుధవారం కూడా అందులోనే ఉండిపోయారు. తన తండ్రి దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి బతికుండగా… ఈ భవంతిని జగన్ ముచ్చటపడి మరీ కట్టించుకున్న సంగతి తెలిసిందే. అయితే వైఎస్ రాజశేఖరరెడ్డి హఠాన్మరణం, ఆ తర్వాత రాజకీయాల్లో బిజీ అయిపోవడంతో జగన్ ఆ భవంతికి వెళుతున్న సందర్భాలు తగ్గిపోయాయి. అసలు మూడేళ్లుగా జగన్ సదరు భవంతిలో అడుగుపెట్టిందే లేదనే చెప్పాలి. అయితే కూతురు సెండాఫ్ ఇచ్చే సందర్భంగా దొరికిన అవకాశాన్ని జగన్ ఇలా తాను ముచ్చటపడి కట్టుకున్న భవంతిలో రిలాక్స్ డ్ గా గడిపారన్న మాట.
Gulte Telugu Telugu Political and Movie News Updates