బీఆర్ఎస్ కు రాజీనామా.. సొంతంగా పోటీ!

హ్యాట్రిక్ విజయంపై కన్నేసి.. తెలంగాణ ఎన్నికల యుద్ధానికి సిద్ధమవుతున్న బీఆర్ఎస్ కు షాక్ లు తప్పడం లేదు. ఎప్పుడో టికెట్లు ప్రకటించినప్పటికీ.. ఇంకా అసంత్రుప్తి సెగ కొనసాగుతూనే ఉంది. టికెట్లు రాలేవనే నిరాశతో కీలక నాయకులు ఆ పార్టీని వీడుతూనే ఉన్నారు. కేటీఆర్ బుజ్జగించినా.. హరీష్ రావు నచ్చజెప్పినా వెళ్లేవాళ్లు వెళ్తూనే ఉన్నారు. తాజాగా బీఆర్ఎస్ కీలక నేత, ముదిరాజ్ సంఘం రాష్ట్ర నాయకుడు కొత్తపల్లి నీలం మధు ఆ పార్టీకి రాజీనామా చేశారు. పటాన్ చెరులో బీఆర్ఎస్ బలోపేతం కోసం పదేళ్లుగా పని చేశానని, అయినా ప్రాధాన్యత దక్కడం లేదని నీలం మధు ఆవేదన వ్యక్తం చేశారు.

చివరి క్షణం వరకూ పటాన్ చెరు టికెట్ కోసం నీలం మధు తీవ్రంగా ప్రయత్నించారు. టికెట్ వస్తుందనే ఆశతో ఉన్నారు. తనకు టికెట్ ప్రకటించే విషయంలో బీఆర్ఎస్ పార్టీకి అక్టోబర్ 16 వరకు డెడ్ లైన్ విధించారు. పార్టీ అధినాయకత్వం స్పందించకపోతే రాజీనామా చేస్తానని కూడా ప్రకటించారు. అన్నట్లుగానే ఇప్పుడు పార్టీని వీడారు. ఇక్కడి బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి బీఫామ్ దక్కడంతో మధు బీఆర్ఎస్ ను వీడారు. రాజీనామ లేఖను కేసీఆర్ కు పంపించారు.

స్వగ్రామం సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం కొత్తపల్లిలో మధు రాజీనామా ప్రకటన చేశారు. అంతే కాకుండా ఈ సారి ఎన్నికల బరిలో దిగుతానని కూడా ఆయన స్పష్టం చేశారు. కొత్తపల్లి గ్రామం నుంచి పాదయాత్ర చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. 2001లో బీఆర్ఎస్లో చేరిన మధు.. 2014లో జడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2019లో చిట్కూరు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా సర్పంచ్గా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యే టికెట్ కోసం ఆశించి భంగపడ్డారు. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఎన్నో విధాలుగా ఇబ్బంది పెడుతున్నారని, బీఆర్ఎస్ కు రాజీనామా చేసి ప్రజల దగ్గరకు వెళ్తున్నానని మధు పేర్కొన్నారు. ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని మధు ప్రకటించారు. దీంతో సొంతంగా ఆయన పోటీ చేస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లేదా కాంగ్రెస్ లో చేరతారా? అనే సందేహాలు వినిపిస్తున్నాయి.