పవన్ పెళ్లిళ్లపై జగన్ వివాదాస్పద వ్యాఖ్యలు

Y S Jagan

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ పెళ్లిళ్లను టార్గెట్ చేస్తూ జగన్ షాకింగ్ కామెంట్లు చేశారు. పవన్ ఇల్లు హైదరాబాద్ లో ఉందని, ఇంట్లో ఇల్లాలు మాత్రం ప్రతి మూడు, నాలుగు సంవత్సరాలకు మారిపోతుంటారని ఎద్దేవా చేశారు. ఒకసారి లోకల్..ఒకసారి నేషనల్..మరోసారి ఇంటర్నేషనల్…మరి తర్వాత ఎక్కడకు పోతాడో..అంటూ పవన్ పై జగన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఆడవాళ్లన్నా, పెళ్లిళ్ల వ్యవస్థన్నా…ఈ పెద్దమనిషికి ఉన్న గౌరవమేమిటన్నది ఆలోచన చేయాలని జగన్ అన్నారు.

గురువారం సామర్లకోటలో జరిగిన సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమం బహిరంగ సభలో జగన్ ఈ కామెంట్లు చేశారు.
ప్యాకేజీ స్టార్ ది ‘యూజ్ అండ్ త్రో’ పాలసీ అని, మన ఇళ్లల్లో అక్క చెల్లెమ్మలను మనం గౌరవించకపోతే..మనం లీడర్లు ఎలా అవుతామని జగన్ ప్రశ్నించారు. ఇళ్లాళ్లను మారుస్తుంటే..ఆడవాళ్ల మీద ఎలాంటి గౌరవం ఉంది అనే విషయం అర్థమవుతోందని అన్నారు. ఈ ప్యాకేజీ స్టార్ కు భీమవరంతో సంబంధం లేదని, గాజువాకతో అనుబంధం లేదని జగన్ విమర్శించారు. పక్క రాష్ట్రంలో ఉంటూ అప్పుడప్పుడూ వచ్చి పోయే వాళ్లకు మన రాష్ట్రంపై, రాష్ట్ర ప్రజలపై ప్రేమ ఎలా ఉంటుందని జగన్ ప్రశ్నించారు.

పవన్ అవకాశవాద రాజకీయాలు చేస్తూ అభిమానుల ఓట్లను గంపగుత్తగా అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. అభిమానుల ఓట్లను హోల్ సేల్ గా అమ్ముకోవడానికే షూటింగ్ గ్యాప్ లో రాష్ట్రానికి వస్తూ పోతూ ఉంటాడని పవన్ పై జగన్ సెటైర్లు వేశారు. సొంత పార్టీని, సొంత వర్గాన్ని వేరే వారికి అమ్ముకునే వ్యాపారి పవన్ మాత్రమేనని జగన్ విమర్శించారు.