మా..’కారు’ మాదే: ఢిల్లీ హైకోర్టులో బీఆర్ఎస్ పిటిష‌న్‌

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల ముంగిట అధికార పార్టీ బీఆర్ ఎస్‌కు ఎన్నిక‌ల గుర్తు క‌ష్టాలు వ‌చ్చి ప‌డ్డాయి. బీఆర్ ఎస్ ఎన్నిక‌ల గుర్త‌యిన కారు ను పోలిన గుర్తులు ఇత‌ర పార్టీల‌కు కేటాయించ‌డం బీఆర్ ఎస్‌కు తీవ్ర సంక‌టంగా మారింది. ఈ నేప‌థ్యంలో గ‌త కొన్ని నెల‌లుగా ఈ విష‌యంపై కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి బీఆర్ ఎస్ నాయ‌కులు లిఖిత పూర్వ‌కంగా కూడా ఫిర్యాదులు చేశారు. అయితే.. నెల‌లు గ‌డిచి, ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వ‌చ్చేసినా ఇప్ప‌టి వ‌ర‌కు.. ఎన్నిక‌ల సంఘం ఎలాంటి చ‌ర్య‌లూ తీసుకోలేదు.

దీంతో విసిగి వేసారిన బీఆర్ ఎస్‌.. ఎన్నికల గుర్తులపై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. కారును పోలి ఉన్న గుర్తులను ఏ గుర్తింపు పార్టీకి కేటాయించ వద్దు అని కేంద్ర ఎన్నిక‌ల సంఘాన్ని ఆదేశించేలా అభ్య‌ర్థిస్తూ రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై గురువారం విచార‌ణ జ‌ర‌గ‌నుంది. ఎన్నికల గుర్తు కారును పోలి ఉన్న గుర్తులు మరొక పార్టీకి కేటాయించడం వల్ల తమకు నష్టం జరుగుతోందని రిట్ పిటిషన్ లో బీఆర్ఎస్ పేర్కొంది.

ఢిల్లీ హైకోర్టులో బీఆర్ఎస్ తరపున న్యాయవాది మోహిత్ ఈ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం బీఆర్ఎస్ జాతీయ పార్టీగా అవతరించింద‌ని, ఈ క్రమంలోనే పలు రాష్ట్రాల్లో పోటీకి సిద్ధమవుతోందని ఆయ‌న పిటిష‌న్‌లో వివ‌రించారు. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో కారును పోలిన గుర్తులుంటే పార్టీకి ఇబ్బంది కలిగే అవకాశం ఉందని, ఆ గుర్తును ఏ పార్టీకి కేటాయించవద్దని ఢిల్లీ హైకోర్టకు విన్న‌వించారు. మ‌రి కోర్టు ఏమేర‌కు స్వాంతన చేకూరుస్తుందో చూడాలి.