తెలంగాణ టీడీపీ ప‌రిస్థితేంటి?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు సంబంధించిన నోటిఫికేష‌న్ వ‌చ్చేసింది. ఎన్నిక‌ల‌కు ముహూర్తం కూడా ఖ‌రారై పోయింది. దాదాపు అన్ని పార్టీలూ అభ్య‌ర్థుల ఖ‌రారులో త‌ల‌మున‌క‌లై ఉన్నాయి., మ‌రికొన్ని పార్టీ ప్ర‌చారంలో ప‌డిపోయాయి. మొత్తంగా తెలంగాణ గురించి మాట్లాడితే.. ఎన్నిక‌ల సంరంభ‌మే క‌నిపిస్తోం ది.. వినిపిస్తోంది. మ‌రి ఇలాంటి స‌మ‌యంలో కీల‌క‌మైన మ‌రో పార్టీ టీడీపీ ప‌రిస్థితి ఏంటి? ఎన్నిక‌ల్లో పోటీ చేస్తుందా? లేదా? అనేది ఇప్పుడు ప్ర‌ధాన ప్ర‌శ్న‌గా మారిపోయింది.

2018లో జ‌రిగిన తెలంగాణ ఎన్నిక‌ల్లో అధికార పార్టీ బీఆర్ ఎస్‌కు ప్ర‌ధాన పోటీ ఇచ్చిన టీడీపీ-కాంగ్రెస్ కూట‌మి విష‌యం ప్ర‌త్యేకంగా చెప్ప‌క‌న‌క్క‌ర‌లేదు. ముఖ్యంగా కూక‌ట్‌ప‌ల్లి వంటి కీల‌మైన నియోజ‌క‌వ‌ర్గం లో టీడీపీ త‌ర‌ఫున నంద‌మూరి వార‌సురాలు సుహాసిని పోటీ చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. ఇక‌, ఆ ఎన్నిక‌ల్లో అధికారం ఎలా ఉన్నా.. టీడీపీ సొంత‌గా నాలుగు స్థానాలు గెలుచుకుని.. త‌న అస్తిత్వాన్ని నిల‌బెట్టుకుంది.

ఇక‌, ఇప్పుడు జ‌రుగుతున్న ఎన్నిక‌ల‌పై గ‌త రెండు మూడు నెల‌ల నుంచే పార్టీ ప్ర‌త్యేకంగా దృష్టి పెట్టింది . నాలుగు మాసాల కింద‌ట పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు.. ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలో భారీ బ‌హిరం గ స‌భ పెట్టి.. పార్టీకి ఓట్లు అడిగే హ‌క్కు ఉంద‌ని, హైద‌రాబాద్ అభివృద్ధి, సైబ‌రాబాద్ నిర్మాణం వంటివి టీడీపీనే చేప‌ట్టింద‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో త‌మ అభ్య‌ర్థులు రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేస్తార‌ని కూడా అప్ప‌ట్లో చంద్ర‌బాబు వివ‌రించారు. ఆ స‌భ భారీ విజ‌యం సాధించింది.

ఈ నేప‌థ్యంలో అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు స‌మ‌యం ఎప్పుడు వ‌స్తుందా? అని టీడీపీ అనుకూల నాయ‌కులు, పార్టీలో ఉన్న సీనియ‌ర్లు కూడా ఎదురు చూశారు. ఆ స‌మ‌యం రానే వ‌చ్చింది. అయితే, ఇప్పుడు పార్టీ అధినేత చంద్ర‌బాబు స్కిల్ కేసులో ఇరుక్కుని.. రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైల్లో ఉండ‌డం.. పార్టీ త‌ర‌ఫున బ‌ల‌మైన గ‌ళం వినిపించేందుకు ఎవ‌రూ తెలంగాణ‌లో ముందుకు రాక‌పోవ‌డం, ఉన్న పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వ‌ర్ అనారోగ్య కారణాల‌తో పెద్ద‌గా దూకుడు చూపించ‌క‌పోవ‌డంతో టీడీపీ ఇప్పుడు పోటీ చేస్తుందా? లేదా? అనే చ‌ర్చ జోరుగా సాగుతోంది.

మ‌రో వైపు టీడీపీకి ద‌న్నుగా ఉన్న కీల‌క‌మైన నాయ‌కుడు.. రావుల చంద్ర‌శేఖ‌ర‌రెడ్డి వంటి వారు.. టీడీపీని వీడి బీఆర్ ఎస్‌తో చేతులు క‌లిపేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్టు తెలుస్తోంది. ఆయ‌న క‌నుక పార్టీ మారితే.. ఆయ‌న వెంట మ‌రింత మంది నాయ‌కులు జంప్ చేస్తార‌ని స‌మాచారం. ఇదే జ‌రిగితే.. అసెంబ్లీ ఎన్నిక‌ల ముంగిట‌.. టీడీపీకి ఇబ్బందిక‌ర‌ప రిణామాలు త‌ప్ప‌వ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.