జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సీఎం జగన్ సెటైర్లు వేశారు. చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైల్లో కలిసిన తర్వాత పొత్తుల గురించి పవన్ ప్రకటించారని, రెండు సున్నాలు కలిసినా….నాలుగు సున్నాలు కలిసినా…సున్నానే అని ఎద్దేవా చేశారు. ఒకరు పార్టీ పెట్టి 15 ఏళ్లయిన నియోజకవర్గంలో నాయకులు లేరని, జెండా మోసే కార్యకర్త లేడని పవన్ కళ్యాణ్ పై విమర్శలు గుప్పించారు. జీవితం మొత్తం చంద్రబాబును భుజాలపై మోసేందుకే సరిపోతుందంటూ పవన్ పై విమర్శలు గుప్పించారు.
చంద్రబాబు అవినీతిలో దత్తపుత్రుడు పవన్ కూ భాగస్వామ్యం ఉందని సంచలన ఆరోపణలు చేశారు. బిస్కెట్లు, చాక్లెట్లు పంచినట్లు తన అనుచరులకు, దత్తపుత్రుడికి ప్రభుత్వ సొమ్మును పంచి పెట్టారని చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. రాజకీయం అంటే దోచుకోవడం, పంచుకోవడం, తినడం కాదని…చనిపోయిన తర్వాత కూడా ప్రతి ఇంట్లో తన ఫోటో చూసి పేదవాడు చిరునవ్వు చిందించాలని అన్నారు. ప్రజలతోనే వైసీపీ పొత్తు అని, గ్రామస్థాయి నుంచి ప్రజలతో వైసీపీ శ్రేణులు మమేకం కావాలని పిలుపునిచ్చారు. తాను దేవుడిని, ప్రజలను నమ్ముకున్నానని, పొత్తులపై ఆధారపడలేదని చెప్పారు.
రాబోయే ఎన్నికలు పేదవారికి, పెత్తందారులకు మధ్య జరగబోయే యుద్ధమని అన్నారు. ఫిబ్రవరిలో ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేస్తామని, మార్చిలో ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రారంభంలో కొందరు ఎమ్మెల్యేలు తనను తిట్టుకుని ఉండొచ్చని, ఇలా గడపగడపకు తిరగమంటున్నాడేంటి అని అనుకుని కొంత బాధపడి ఉండొచ్చని జగన్ అన్నారు. అయితే, ఇప్పుడు ఎమ్మెల్యేల ముఖాల్లో ఆనందం కనిపిస్తోందని, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా నాయకులు నిరంతరం ప్రజల్లో ఉన్న పార్టీ మనది కాబట్టే ప్రజలు ఆదరిస్తున్నారని తెలిపారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates