పవన్ కు అస్వస్థత..పెడన సభ వాయిదా?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ మచిలీపట్నంలో జనవాణి కార్యక్రమాన్ని ఈ రోజు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తనతో సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన దివ్యాంగులు, బధిరులను చూసి పవన్ కంటతడి పెట్టారు. జనసేన-టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరిస్తున్న సమయంలో తీవ్ర వెన్ను నొప్పికి గురయ్యారు.

కాసేపు విశ్రాంతి తీసుకున్నప్పటికీ నొప్పి తగ్గకపోవడంతో జనవాణి కార్యక్రమాన్ని అర్ధాంతరంగా ఆపి అక్కడి నుంచి వెళ్లిపోయారు. గబ్బర్ సింగ్’ సినిమా షూటింగ్ సమయంలో పవన్ వెన్నుపూసకు గాయం కాగా…తరచుగా వెన్ను నొప్పి వస్తోందని పవన్ గతంలో చెప్పారు. రేపు పెడన సభ నేపథ్యంలో పవన్ అస్వస్థతకు గురికావడంతో పవన్ అభిమానులు, జనసైనికులు ఆందోళన చెందుతున్నారు. ఒకవేళ పవన్ కు నొప్పి తగ్గకుంటే పెడన సభ క్యాన్సిల్ అవుతుందేమో అని కంగారు పడుతున్నారు.

అంతకుముందు, జగన్ పై పవన్ విరుచుకుపడ్డారు. క్లాస్ వార్ అని ఇంకోసారి మాట్లాడకు జగన్… రాయలసీమ నుంచి మచిలీపట్నం వచ్చి ప్రజలు తమ సమస్యలు తనతో చెప్పుకుంటున్నారు అని మండిపడ్డారు. అణగారిన వర్గానికి నాయకుడిగా చెప్పుకునే పెద్ద మనిషి జగన్‌ పేదల ఇళ్లను దౌర్జన్యంగా ఖాళీ చేయించి వీధికి లాగాడని విమర్శించారు. వైఎస్ కూడా హైదరాబాద్‌లో కాంగ్రెస్ కార్యాలయం కోసం పేదల ఇళ్లు కూల్చేశారని ఆరోపించారు. పేపర్లపై పట్టాలు చూపించి..ఇళ్లను తొలగించడం దుర్మార్గం అని, న్యాయం చేసే వరకు క్లాస్ వార్ అని చెప్పకు అంటూ హెచ్చరించారు.