కరోనాతో అల్లాడిపోతున్న మహారాష్ట్రలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రాయ్ గఢ్ జిల్లాలోని కాజల్ పురా ప్రాంతంలో ఓ భారీ భవనం ఉన్నట్లుండి కుప్పకూలిపోయింది. ఐదు అంతస్థుల ఈ భవనం పూర్తిగా కుప్పకూలిపోగా.. శిధిలాల కింద 75 మంది వరకూ చిక్కుకున్నట్టు తెలుస్తోంది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. 25 మంది ప్రాణాలతో బయటపడగా.. ఇంకో 50 మంది శిథిలాల్లో చిక్కుకున్నట్లు సమాచారం. వారిలో చాలామంది మరణించి ఉంటారని భావిస్తున్నారు. తారిఖ్ గార్డెన్గా పేరున్న ఈ భవనం పదేళ్ల క్రితం నాటిది. 40 అపార్ట్మెంట్లున్నాయి.
సాయంత్రం ఆరు గంటల సమయంలో కుప్పకూలిందని పోలీస్ అధికారులు తెలిపారు. కూలిపోయే సమయంలో చాలామంది బయటకు పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకున్నారు. ఇరుగ్గా ఉండే ఇళ్లలో ఎవరికి వారు తమ తమ పనుల్లో నిమగ్నమై ఉండగా.. భవనం ఒక్కసారిగా కుప్పకూలినట్లు తెలుస్తోంది. ఇంకో రెండు గంటల తర్వాత భవనం కూలి ఉంటే నష్టం ఇంకా తీవ్రంగా ఉండేదే. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదానికి కారణమేంటనేది ఇంకా తెలియలేదు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ బలగాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. ఈ దుర్ఘటనపై ఆయన విచారం వ్యక్తం చేశారు.