బండారు వ‌ర్సెస్ రోజా… అడ్డంగా బుక్క‌యిన వ‌ర్మ‌

టీడీపీ నాయ‌కుడు బండారు స‌త్య‌నారాయ‌ణ మూర్తి వ‌ర్సెస్ మంత్రి ఆర్కే రోజా విష‌యంలో త‌లెత్తిన వివాదంలో సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ వేలు పెట్టిన విష‌యం తెలిసిందే. బండారు స‌త్య‌నారాయ‌ణ మూర్తి నోరు పారేసుకున్నార‌ని, ఒక మ‌హిళ గురించి ఎవ‌రైనా బ‌య‌టి వ్య‌క్తులు ఇలా మాట్లాడ‌తారా? అంటూ.. ఆయ‌న వ్యాఖ్యానించారు. అయితే, మ‌హిళ‌ల గురించి ఆర్జీవీ మాట్లాడ‌డం ఆశ్చ‌ర్యంగా ఉంద‌ని నెటిజ‌న్లు ట్రోల్ చేస్తున్నారు.

“మ‌హిళ‌ల ఆత్మ గౌర‌వం గురించి వ‌ర్మ చెపితేనే వినాలి” అంటూ కొంద‌రు నెటిజ‌న్లు స్పందించారు. మ‌రికొంద‌రు.. వ‌ర్మ గురివింద నీతులు చెబుతున్నాడంటూ కామెంట్లు చేశారు. మంత్రి రోజా నోరు పారేసుకున్నప్పుడు వ‌ర్మ ఎక్క‌డున్నారంటూ ప్ర‌శ్నించారు. అధికారంలో తమ పార్టీ వుంది కదా, ప్రతిపక్ష పార్టీ ఎవరన్నా ఏదన్నా అంటే కేసులు పెట్టడమే పనిగా చేస్తున్న అధికార పార్టీవాళ్లకి, ఆర్జీవీకి సదరు మంత్రిగారు మాట్లాడిన బాష, ఒకా మాజీ ముఖ్యమంత్రి అని కూడా చూడకుండా అతన్ని ఎంత నీచంగా మాట్లాడారో వినపడలేదా అని కొంద‌రు ప్ర‌శ్నించారు.

చంద్రబాబు స‌తీమ‌ణి భువ‌నేశ్వ‌రి గురించి వైసీపీ నాయ‌కులు అత్యంత ఘోరంగా, అగౌరవంగా మాట్లాడినప్పుడు ఆర్జీవీ కి వినిపించ‌లేదా? అప్పుడు మహిళా కమిషన్ గుర్తుకు రాలేదా అని మ‌రికొంద‌రు అడిగారు. ఈ క్ర‌మంలోనే ఆర్జీవీ గ‌తంలో ఒక యువ‌తి కాళ్ళు నాకడం, చేతులు నాకటం, ఇంకా స్త్రీ యొక్క అవయవాల గురించి మాట్లాడటం వంటి పోస్టుల‌ను సోష‌ల్ మీడియాలో పోస్టు చేయ‌డం గ‌మ‌నార్హం. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నించిన వారు ఆర్జీవీ అడ్డంగా బుక్క‌య్యాడే అని వ్యాఖ్యానిస్తున్నారు.