జగన్ సర్కారు అంత హడావుడి చేసి..

ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ బాధితుల కోసమని అనంతపురం జిల్లాలో 1500 పడకలతో ఓ భారీ తాత్కాలిక ఆసుపత్రిని జగన్ సర్కారు యుద్ధ ప్రాతిపదికన సిద్ధం చేస్తోందని సోషల్ మీడియాలో వైకాపా అభిమానులు హోరెత్తించేసిన విషయం గుర్తుండే ఉంటుంది.

చంద్రబాబును దెప్పిపొడుస్తూ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ఒక సందర్భంలో ఈ ఆసుపత్రి గురించి ప్రస్తావించారు. అనంతపురంలో అద్భుతమైన కోవిడ్ ఆసుపత్రి రెడీ అయింది. చంద్రబాబుకు కరోనా సోకినా అక్కడికెళ్లి చికిత్స చేయించుకోవచ్చు అంటూ ఆయన ట్వీట్ చేశాడు.

ఇక ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ స‌ల‌హాదారుల్లో ఒక‌రైన రాజీవ్ కృష్ణ అయితే ఎక్కడో కర్ణాటకలో సిద్ధమైన కోవిడ్ ఆసుపత్రి ఫొటోలు పట్టుకొచ్చి.. చూశారా జగన్ సర్కారు ఇంత తక్కువ సమయంలో ఎంత మంచి ఆసుపత్రి రెడీ చేసిందో అంటూ ఎలివేషన్లు కూడా ఇచ్చేశారు. కట్ చేస్తే.. అది కర్ణాటకలోని ఆసుపత్రి అనే విషయాన్ని నెటిజన్లు బయటపెట్టేశారు. కానీ ఆయన తప్పు తెలుసుకుని పొరబాటును దిద్దుకున్నారు.

ఐతే ఇంత చర్చ జరిగి, ఇంతగా ఎలివేషన్ ఇచ్చుకున్న ఆసుపత్రిని కొంచెం ఆలస్యం అయినప్పటికీ కచ్చితంగా సిద్ధం చేస్తారని, మంచి వసతులు కల్పిస్తారని అంతా అనుకున్నారు. కానీ తీరా చూస్తే ఇప్పటిదాకా ఆ ఆసుపత్రి సిద్ధమే కాలేదు. పెద్ద గోడౌన్ ఒకటి అద్దెకు తీసుకుని పనులైతే మొదలుపెట్టారు కానీ.. అవి పూర్తి చేయలేదు.

ఉన్నతాధికారులు పట్టించుకోలేదా.. నిధులు అందలేదా.. దీని అవసరం లేదనుకున్నారా అన్నది తెలియదు. ఆసుపత్రి మాత్రం ఇప్పటికీ రెడీ కాలేదు. లోపల ఏమాత్రం సౌకర్యాలు లేకుండా మామూలు గోడౌన్‌లాగే కనిపిస్తోందది. దీని గురించి ఓ ప్రధాన పత్రిక కథనం కూడా రాసింది. అయినా ప్రభుత్వంలో కదలిక లేదు.

మరి ఏమీ చేయని చోట అద్భుతం జరిగిపోతోందంటూ సోషల్ మీడియాలో ప్రచారాలు చేసుకోవడమెందుకు? అలా చేశాక ఇలా పట్టించుకోకుండా వదిలేయడం ఎందుకు? ఈ సోషల్ మీడియా కాలంలో ఇలాంటి విషయాల్లో ఎంతగా డ్యామేజ్ జరుగుతుందో తెలిసి కూడా ఇంత నిర్లక్ష్యమేమిటో?