కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మధుయాష్కీ ఆశలు గల్లంతేనా? ఎల్బీ నగర్ టికెట్ ఆశిస్తున్న ఆయనకు భంగపాటు తప్పదా? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానాలే వస్తున్నాయి. మధుయాష్కీకి ఎల్బీ నగర్ టికెట్ ఇవ్వొద్దంటూ స్థానిక కాంగ్రెస్ నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడమే అందుకు కారణమని చెప్పాలి. ఈ స్థానిక కాంగ్రెస్ నేతలు ఏకంగా ఢిల్లీ వెళ్లి మరీ మధుయాష్కీకి వ్యతిరేకంగా పార్టీ పెద్దలను కలుస్తున్నట్లు తెలిసింది.
ఎల్బీ నగర్లో పార్టీకి సానుకూల ఫలితాలు వస్తాయనే అంచనాతో స్థానికుడు కాకపోయినప్పటికీ ఇక్కడి టికెట్ కోసం యధుయాష్కీ దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఇప్పుడు అభ్యర్థుల ఎంపిక తుది ప్రక్రియను చేపట్టిన కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ ఎల్బీ నగర్ విషయంలో ఎటూ తేల్చలేకపోతుందని తెలిసింది.
2018 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి సుధీర్ రెడ్డి ఎల్బీ నగర్లో గెలిచారు. కానీ అనంతరం ఆయన బీఆర్ఎస్లో వెళ్లిపోయారు. కానీ ఇక్కడ కాంగ్రెస్కు మాత్రం బలం అలాగే ఉంది. దీంతో ఎల్బీ నగర్ నుంచి పోటీ చేసి గెలవాలని మధుయాష్కీ గౌడ్ చూస్తున్నారు. నిజామాబాద్ లోక్ సభ స్థానం నుంచి 2004లో పోటీ చేసి మధుయాష్కీ ఎంపీగా గెలిచారు. 2009లోనూ మరోసారి విజయం సాధించారు. కానీ 2014, 2019 లోక్ సభ ఎన్నికల్లో ఓడిపోయారు. ఈ సారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్బీ నగర్ నుంచి పోటీ చేయాలని చూస్తున్నారు.
కానీ ఇప్పటికే ఎల్బీ నగర్ పై పార్టీ సీనియర్ నాయకుడు జక్కడి ప్రభాకర్ రెడ్డి, మల్ రెడ్డి రాంరెడ్డి, దరిపెల్లి రాజశేఖర్ రెడ్డి, జితేందర్ తదితరులు కన్నేశారు. ఇప్పుడు మధుయాష్కీ రావడాన్ని వీళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే ఏకంగా ఢిల్లీ వెళ్లి మాణిక్ రావు ఠాక్రే, రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలను కలిశారు. తమలో ఏ ఒక్కరికి టికెట్ ఇచ్చినా కలిసి పని చేస్తామని ఈ ఎల్బీ నగర్ కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అలా కాదని మధుయాష్కీకి టికెట్ ఇస్తే పార్టీ కోసం పని చేసేదే లేదని తేల్చి చెప్పినట్లు తెలిసింది.
మరోవైపు సేవ్ ఎల్బీ నగర్ కాంగ్రెస్.. ప్లీస్ సే నో టికెట్ టు ప్యారాచూట్స్.. గో బ్యాక్ టు నిజామాబాద్.. అని మధుయాష్కీకి వ్యతిరేకంగా గాంధీభవన్ దగ్గర ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఎల్బీ నగర్ కాంగ్రెస్ పేరుతో ఈ ఫ్లెక్సీలు వెలిశాయి. ఈ విభేధాల నేపథ్యంలో మధుయాష్కీకి ఎల్బీనగర్ టికెట్ దక్కడం కష్టమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.