గత కొద్దికాలంగా జరుగుతున్న చర్చకు తెర దించుతూ మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పేస్తూ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. వీడియో మెసేజ్ రిలీజ్ చేసిన మైనంపల్లి హనుమంతరావు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు తెలియజేయడమే కాకుండా త్వరలోనే తాను ఓ పార్టీలో చేరబోతున్నట్లు ప్రకటించారు. అయితే, మైనంపల్లి బదులుగా మల్కాజ్‌గిరి నియోజకవర్గం నుంచి బరిలో దిగబోయే నేత ఎవరనే చర్చ జరుగుతుంది. అయితే, ఇప్పుడు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఓ ముగ్గురు నేతలను బరిలో దింపినట్లు సమాచారం.
మైనంపల్లి రాజీనామాతో మల్కాజ్‌గిరి నియోజకవర్గం నుంచి బరిలో దింపే బీఆర్ఎస్ నేత ఎవరనే చర్చ సహజంగానే జరుగుతోంది. అయితే, ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ముగ్గురు నేతలను గుర్తించిందని సమాచారం. మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి బీఆర్ఎస్ మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉంటారని టాక్ వినిపిస్తోంది. ఇదే సమయంలో మరో పేరు సైతం తెరమీదకు వస్తోంది. మల్కాజ్‌గిరి కాంగ్రెస్ నేత నందికంటి శ్రీధర్ బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారని మల్కాజ్‌గిరి నుంచి బరిలో దిగేలా కసరత్తు దాదాపు ఫైనల్ అయిందని అంటున్నారు. కాగా, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తరఫు నుంచి సైతం ఓ పేరు ప్రతిపాదనలో ఉన్నట్లు సమాచారం.
మర్రి రాజశేఖర్ రెడ్డి మంత్రి మల్లారెడ్డి తరఫున ప్రతిపాదనలో ఉండగా, గతంలో టీడీపీలో చాలా కాలం పాటు పని చేసిన వ్యక్తి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దగ్గరి బంధువు అయిన మండలి రాధకృష్ణా యాదవ్ సైతం ఆశావహుల్లో ఉన్నట్లు సమాచారం. మరో వైపు ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ నేత , బీసీ నందికంటి శ్రీధర్ పై గురి పెట్టిన బీఅర్ఎస్ పార్టీ ఆయన అభ్యర్థిత్వాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్తున్నారు. మొత్తంగా మైనంపల్లి ఎపిసోడ్‌కు ఫుల్ స్టాప్ పడిన నేపథ్యంలో బీఆర్ఎస్ తమ తదుపరి కార్యాచరణ మొదలుపెట్టినట్లు సమాచారం.