మహిళా రిజర్వేషన్ల బిల్లు పార్లమెంటులో పాస్ అవ్వటం ఖాయం. దశాబ్దాలుగా పెండింగులో ఉన్న ఈ బిల్లు అమల్లోకి వస్తే చాలామంది సీనియర్ మగ నేతల జాతకాలు తారుమారైపోతాయి. రిజర్వేషన్ల పునర్విభజన కారణంగా ఎంతమంది పురుషనేతల రాజకీయం తల్లకిందులైపోయిందో మహిళా రిజర్వేషన్ బిల్లు వల్ల అంతకుమించి దెబ్బపడబోతోంది. మహిళల దెబ్బకు రాజకీయంగా పురుషుల అడ్రస్సులే మారిపోతోబోతున్నాయి. విషయం ఏమిటంటే బిల్లు గనుక అమల్లోకి వస్తే ఏపీలో ఎన్నిసీట్లు మహిళలకు కేటాయించాలో తెలుసా ?
లోక్ సభలో ఏపీకి ఇపుడు 25 సీట్లున్నాయి. బిల్లు గనుక అమల్లోకి వస్తే ఇందులో 8 సీట్లను కచ్చితంగా మహిళలకు కేటాయించకతప్పదు. ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గాలను పార్టీలు ఎలా ఫాలో అవుతున్నాయో అదేపద్దతిలో ఇక నుండి మహిళల కోటాను కూడా ఫాలో అవ్వాల్సిందే. అలాగే 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మహిళల కోసం 58 నియోజకవర్గాలు రిజర్వు అయిపోతాయి. ఈ రిజర్వేషన్లు 2029 సార్వత్రిక ఎన్నికల నుండి అమల్లోకి రాబోతోంది.
అంటే తాము ఎంతగొప్ప నేతలమని అనుకుంటున్న వాళ్ళకైనా 2024 ఎన్నికలే చివరి ఎన్నికలని అనుకోవాలి. మహిళలకోసం రిజర్వు చేయబోయే నియోజకవర్గాల్లో ఇక మగాళ్ళ పెత్తనం కుదరదు. తెరవెనుక నుండి చక్రం తిప్పాల్సిందే తప్ప తెర ముందుకు రావటం కుదరదు. రిజర్వేషన్లు అంటే ఏ ఏ నియోజకవర్గాల్లో మహిళ ఓట్లు ఎక్కువగా ఉన్నాయో వాటినే మహిళలకు రిజర్వు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
లోక్ సభకు సంబంధించి విశాఖపట్నం, గుంటూరు, నరసరావుపేట, నెల్లూరు, తిరుపతి, అనంతపురం, నంద్యాల, విజయవాడ నియోజకవర్గాల్లో 2029 నుండి మహిళలే చక్రం తిప్పబోతున్నారు. ఇపుడు కూడా పార్టీలు మహిళలకు టికెట్లు కేటాయిస్తున్నాయి. అయితే తప్పనిసరి లేదా ఆబ్లిగేషన్ పద్దతిలో మాత్రమే కేటాయిస్తున్నాయి. అదే రిజర్వేషన్ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందితే ఇక నుండి చట్టంగా మారుతుంది. అప్పుడు పోటీచేయటం అన్నది మహిళల హక్కుగా మారుతుంది. ఈ బిల్లువల్ల నాయకత్వ లక్షణాలున్న మరింతమంది మహిళలు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలున్నాయి.