ఇక‌, తేల్చుకోవాల్సింది.. త‌ట్టుకోవాల్సింది.. టీడీపీనే!!

టీడీపీ అధినేత చంద్ర‌బాబు, ఆయ‌న కుమారుడు, పార్టీ యువ నేత నారా లోకేష్ విష‌యంలో ఏపీ అధికార పార్టీ వైసీపీ స్ప‌ష్ట‌మైన వైఖ‌రితోనే ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఇప్ప‌టికే చంద్ర‌బాబును స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ కేసులో అవినీతి జ‌రిగింద‌ని పేర్కొంటూ.. అరెస్టు చేయ‌డంతోపాటు ఆయ‌న‌ను జైల్లో కూడా పెట్టారు. ఇక‌, దీని నుంచి బ‌య‌ట ప‌డేందుకు చంద్ర‌బాబు చేయ‌ని ప్ర‌య‌త్నం లేదు. అయితే.. ఈ ఒక్క కేసుతోనే వైసీపీ వ‌దిలి పెట్టే ప‌రిస్థితి లేద‌ని గ‌త రెండు రోజులుగా జ‌రుగుతున్న ప‌రిణామాలు స్ప‌ష్టం చేస్తున్నాయి.

మ‌రిన్ని కేసుల్లో చంద్ర‌బాబును ఇరికించ‌డం ద్వారా.. ఆయ‌న‌ను ప్ర‌జాబాహుళ్యానికి సుదూరంగా ఉంచా ల‌నే ల‌క్ష్యంతో వైసీపీ అడుగులు వేస్తున్న‌ట్టు టీడీపీలోని సీనియ‌ర్లు అనుమానాలు వ్య‌క్తంచేస్తున్నారు. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే మ‌రో రెండు కేసుల‌ను కూడా సీఐడీ అధికారులు న‌మోదు చేశారు. అమ‌రావ‌తి ఇన్న‌ర్ రింగ్ రోడ్డు విష‌యంలో అలైన్‌మెంట్‌(ప‌రిధి) మార్చ‌డం ద్వారా.. కొంద‌రికి ల‌బ్ధి చేకూరేలా చంద్ర‌బాబు వ్య‌వ‌హ‌రించార‌ని, దీనిపై ఆయ‌న‌ను విచారించాల్సి ఉంద‌ని.. సీఐడీ పేర్కొంది.

దీనికి సంబంధించి రిట్ పిట‌ష‌న్ వేసింది. అదేవిధంగా రాష్ట్రంలో అమ‌లైన ఫైబ‌ర్ నెట్ విష‌యంలోనూ చంద్ర‌బాబును ప్ర‌థ‌మ ముద్దాయిగా చేర్చుతూ.. దీనిని ఎలాంటి టెండ‌ర్లూ లేకుండానే త‌నకు న‌చ్చిన వారికి టెండ‌ర్లు ఇచ్చారని, ఇది కూడా నేర‌మేన‌ని పేర్కొంటూ.. సీఐడీ మ‌రో పిటిష‌న్ దాఖ‌లు చేసింది. ఇక‌, చిత్తూరు జిల్లా అంగ‌ళ్లు ప్రాంతంలో గ‌త నెల‌లో జ‌రిగిన పోలీసులు-టీడీపీ కార్య‌క‌ర్త‌ల ఘ‌ర్ష‌ణ కూడా చంద్ర‌బాబు ప్రోద్బ‌లంతోనే జ‌రిగింద‌ని పేర్కొంటూ.. మ‌రో కేసు క‌ట్టేందుకు రాష్ట్ర పోలీసులు రెడీ అయ్యారు.

అంటే.. మొత్తంగా చంద్ర‌బాబు స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ కేసు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చినా.. ఈ మూడు కేసుల్లో ఏదో ఒక దానిలో ఈలోపే ఆర్డ‌ర్లు తెచ్చుకుని మ‌రింత కాలం చంద్ర‌బాబును జైలు నుంచి బ‌య‌ట‌కు రాకుండా చేసే వ్యూహం తెర‌వెనుక సాగుతోంద‌న్న‌ది టీడీపీ నేత‌ల భావ‌న‌. ఇక‌, ఇదే స‌మ‌యంలో నారా లోకేస్ ను కూడా ఫైబ‌ర్ నెట్‌, స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ కేసుల్లో అరెస్టు చేయాల‌ని చూస్తున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. చంద్ర‌బాబు ఆయ‌న త‌న‌యుడి విష‌యంలో ఎన్నిక‌ల వ‌ర‌కు కూడా వారిని జైలు గోడ‌ల‌కు ప‌రిమితం చేసే వ్యూహం ఏదో సాగుతోంద‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది.

దీనిని బ‌ట్టి వైసీపీ స్ప‌ష్ట‌మైన వైఖ‌రితోనే ముందుకు సాగుతోంది. ఇక‌, ఇప్పుడు ఈ ప‌రిణామాల‌ను అధిగ మించి టీడీపీ నిల‌దొక్కుకోవ‌డం అనేది.. ఇప్పుడు ప్ర‌ధాన ప్ర‌శ్న‌. త‌మిళ‌నాడుకు చెందిన ఎండీఎంకే అధినేత వైగో చెప్పిన‌ట్టు.. ప్ర‌స్తుతం చంద్ర‌బాబు క్లిష్ట ప‌రిస్థితిలో ఉన్నారు. దీని నుంచి వ్యూహాత్మ‌కంగా బ‌య‌ట‌కు రావ‌డం.. వ‌చ్చే ఎన్నిక‌ల‌ను స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొన‌డం అనేది ఇప్పుడు పార్టీకి ప్ర‌ధాన స‌వాల్‌గా మారింది. ఈ విష‌యంలో పార్టీ ఏమేర‌కు స‌క్సెస్ అవుతుంద‌నే దానిని బ‌ట్టి భ‌విష్య‌త్తు ఉంటుంద‌నే చ‌ర్చ సాగుతోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.