వినాయక చవితి సందర్భంగా నూతన పార్లమెంటు భవనంలో తొలిసారిగా సభలను ఈ రోజు నుండి ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ అమృత ఘడియల్లో కొత్త పార్లమెంటులోకి అడుగుపెట్టడం సంతోషంగా ఉందని ప్రధాని మోడీ అన్నారు. కొత్త పార్లమెంటులోకి అడుగుపెట్టబోయే ముందు పార్లమెంటు సభ్యులంతా చివరిసారిగా పాత పార్లమెంటులో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎంపీలనుద్దేశించి పాత పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో మోడీ ప్రసంగించారు. కొత్త పార్లమెంటు భవనంలోకి మారుతున్నప్పటికీ పార్లమెంటు పాత భవనం హుందాతనం తగ్గకూడదని, పాత పార్లమెంటు భవనంగా మిగిలిపోకూడదని మోడీ అన్నారు.
సభ్యులంతా అంగీకరిస్తే పార్లమెంటు పాత భవనాన్ని రాజ్యాంగ సదనంగా పిలుచుకుందామని మోడీ ప్రతిపాదించారు. ఇక, కొత్త పార్లమెంట్ భవనానినికి “పార్లమెంట్ హౌస్ ఆఫ్ ఇండియా”గా మోడీ నామకరణం చేశారు. పార్లమెంటు కొత్త భవనంలో అడుగుపెట్టిన శుభ సందర్భంగా మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టింది. ఆల్రెడీ కేంద్ర కేబినెట్ ఆ బిల్లుకు ఆమోదం తెలిపింది. పార్లమెంటు కొత్త భవనంలో ప్రవేశపెట్టిన తొలి బిల్లు ఇదే. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం 128వ రాజ్యాంగ సవరణ బిల్లును న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్ వాల్ లోక్ సభలో ప్రవేశపెట్టారు.
ఈ బిల్లుపై రేపు లోక్ సభలో చర్చ జరగనుంది. ఈ బిల్లుకు ఉభయ సభల ఆమోదం లభిస్తే లోక్‌సభ, ఢిల్లీ, అన్ని రాష్ట్రాల్లోని శాసనసభల్లోని మొత్తం సీట్లలో 33 శాతం లేదా మూడింట ఒక వంతు మహిళలకు కేటాయించాల్సి ఉంటుంది. దాదాపు ౩ దశాబ్దాలుగాా పెండింగ్‌లో ఉన్న ఈ బిల్లుకు ఇప్పుడు మోక్షం కలగడం విశేషం. అయితే, ఈ బిల్లు క్రెడిట్ తమదేనని, 2010లోనే తాము దీనిని ప్రవేశపెట్టామని కాంగ్రెస్ చెబుతోంది. యూపీఏ 2 ప్రభుత్వ హయాంలో 2010 మార్చి 9 వ తేదీన రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందగా.. లోక్‌సభలో మాత్రం చర్చకు రాలేదు.
అయితే, 2023 పార్లమెంటు సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపినా.. అది 2026 తర్వాతే అమలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా జరిగే జనాభా లెక్కింపు, నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే ఈ బిల్లు అమల్లోకి వస్తుంది. 2024 ఎన్నికలలోపు ఈ రెండు జరిగే అవకాశం దాదాపుగా లేదని, దాదాపుగా 2029 ఎన్నికలలో మహిళా రిజర్వేషన్ బిల్లు ఫలాలు మహిళలకు అందుబాటులోకి వచ్చే అవకాశముందని తెలుస్తోంది.