చంద్రబాబు అరెస్టు వెనుక జగన్, కేసీఆర్, మోడీ

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌పై ఇరు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా ఉన్న పలువురు కీలక నేతలు స్పందించిన సంగతి తెలిసిందే. చాలామంది చంద్రబాబు అరెస్టు చేసిన తీరును ఖండించారు. మరికొందరైతే, మోడీ అండతోనే జగన్..చంద్రబాబును అరెస్టు చేయించారని కూడా ఆరోపించారు.

ఈ క్రమంలోనే తాజాగా చంద్రబాబు అరెస్టుపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మధుయాష్కీ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అరెస్ట్ వెనుక జగన్, మోడీలతోపాటు సీఎం కేసీఆర్ ఉన్నారని షాకింగ్ ఆరోపణలు చేశారు. చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండించిన మధుయాష్కీ…జగన్, కేసీఆర్ కుమ్మక్కై చంద్రబాబును కటకటాల వెనక్కు పంపారని ఆరోపించారు.

ఈ సందర్భంగా కేసీఆర్ పై కూడా మధుయాష్కీ షాకింగ్ కామెంట్లు చేశారు. 2019 ఎన్నికల్లో జగన్‌ ను గెలిపించేందుకు కేసీఆర్ సూట్‌కేసులు అందించారని, బీఆర్ఎస్, బీజేపీ, వైసీపీ ఒక్కటేనని ఆరోపించారు. కేసీఆర్, జగన్, మోడీ కుట్రలను ప్రజలు గమనించాలని ఆయన పిలుపునిచ్చారు.

చంద్రబాబు అరెస్టు అక్రమమని, నిందితులను అరెస్టు చేసే సమయంలో అధికారులు చట్టపరమైన నిబంధనలను పాటించాల్సిన అవసరం ఉందని హితవు పలికారు. చట్టాన్ని అతిక్రమించి కక్ష సాధింపుతో చంద్రబాబును అరెస్టు చేయడం సరికాదన్నారు. కేసీఆర్‌కు తెలియకుండా జగన్ ఏమీ చేయరని, బీఆర్ఎస్, బీజేపీ, వైసీపీ మూడు ఒక్కటేనని ఆరోపించారు.