రాబోయే ఎన్నికల్లో టీడీపీ పొత్తుతో ఎన్నికలకు వెళ్ళబోతున్న జనసేన పెద్ద ప్లానులోనే ఉన్నట్లు తెలుస్తోంది. కడప జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేయాలని పట్టుదలగా ఉందట. రాజంపేట, బద్వేలు, మైదుకూరు నియోజకవర్గాల్లోని నేతలు మహా ఉత్సాహంగా ఉన్నారట పోటీ విషయంలో. పార్టీ తరపున అంతర్గతంగా కూడా నేతలు, క్యాడర్ సమావేశాలు పెట్టుకుని తమ పార్టీనే రాబోయే ఎన్నికల్లో పోటీ చేయబోతోందని చెప్పేసుకుంటున్నారు. మామూలుగా అయితే జనసేన గెలుపు కష్టమని కాకపోతే టీడీపీతో పొత్తుంటుంది కాబట్టి పార్టీ అభ్యర్థుల గెలుపు ఖాయమని చెప్పేసుకుంటున్నారని సమాచారం.
ఈ మూడు నియోజకవర్గాలపై జనసేన ప్రధానంగా కన్నేయటానికి కారణం ఏమిటంటే బలిజ సామాజికవర్గం ఓట్లు ఎక్కువగా ఉండటమే. రాయలసీమలో సామాజిక వర్గాల పరంగా చూసుకుంటే మిగిలిన వాటితో పోల్చినపుడు బలిజల జనాభా చాలా ఎక్కువ. జనసేన తరపున బలిజ సామాజికవర్గం నేతలను పోటీలోకి దింపితే గెలుపు ఖాయమని లోకల్ లీడర్లు లెక్కలేసుకుంటున్నారు. అయితే బలిజ సామాజిక వర్గంతో పాటు ఇతరులు కూడా పోటీపై ఆసక్తి చూపుతున్నారు.
పార్టీలో యాక్టివ్ గా ఉంటు పోటీ విషయంలో బాగా ఆసక్తితో ఉద్యోగానికి రాజీనామా చేసిన శ్రీనివాసరాజు రాజంపేటలో పోటీకి రెడీగా ఉన్నారు. ఇదే సమయంలో బలిజ యువనేత దినేష్ కూడా టికెట్ తనకే వస్తుందని ఆశలు పెట్టుకున్నారు. చాలాకాలంగా రాజంపేట నియోజకవర్గంలో దినేష్ చురుగ్గా ఉంటున్నారు. బద్వేలు ఎస్సీ రిజర్వుడు స్ధానమే అయినా పోటీకి జనసేన రెడీ అంటోంది.
గతంలో టీడీపీ తరఫున పోటీచేసి ఓడిపోయిన విజయజ్యోతి ప్రస్తుతం జనసేనలో చాలా యాక్టివ్ గా ఉన్నారు. ఈమెకు టికెట్ ఇస్తే గెలుపు ఖాయమని అనుకుంటున్నారు. ఇక మైదుకూరులో అయితే టీడీపీ ఇన్చార్జి సుధాకర్ యాదవ్ కు టికెట్ ఖాయమని అనుకుంటున్నారు. అయితే తమకు పోటీచేసే అవకాశం ఇవ్వాలని జనసేన నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇదే డిమాండ్ పై ఒక తీర్మానం చేసి అధినేత పవన్ కల్యాణ్ కు పంపారు. మరి పొత్తులో మైదుకూరు సీటును పవన్ పార్టీకి అడుగుతారా ? చంద్రబాబు ఎలా రియాక్టవుతారు అనేది ఆసక్తిగా మారింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates