పండుగపూట.. తన బలగం ఏమిటో చూపించిన ఎంపీ రఘురామ

తరచూ వార్తల్లోకి వస్తున్నారు నరసాపురం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు. సొంత పార్టీపై తరచూ గళం విప్పుతూ.. అసమ్మతివాదిగా.. ఫైర్ బ్రాండ్ గా వ్యవహరిస్తున్న ఆయన తాజాగా మరోసారి హాట్ టాపిక్ అయ్యారు.

ఢిల్లీలో ఉంటున్న ఆయన ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది. ఏపీ ప్రభుత్వంపై తరచూ విమర్శలు చేయటంతో సొంత పార్టీ నేతలు.. కార్యకర్తలు ఆయన తీరుపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆయనపై ఏపీలోని పలు పోలీస్ స్టేషన్లలో పలు ఫిర్యాదులు నమోదయ్యాయి.

ప్రభుత్వ విధానాలు.. కొందరు నేతలపై తరచూ విమర్శలు చేసే రఘురామ.. ఇప్పటివరకూ అధినేత వైఎస్ జగన్ ను ఉద్దేశించి మాత్రం నేరుగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.

కొన్ని అంశాల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల్ని విభేదిస్తున్న ఆయన.. తాజాగా తన బలగాలతో కలిసి ఫోటో దిగారు. తనకున్న భద్రతా సమస్యల నేపథ్యంలో కేంద్ర బలగాలతో కూడిన రక్షణ కావాలని కోరారు. దీనికి స్పందించిన కేంద్రం.. ఆయనకు వై కేటగిరి భద్రత కల్పిస్తోంది.

తాజాగా పంచెకట్టుతో నిలుచున్న ఎంపీ రఘురామ.. ఆయన వెనుక.. పక్కన.. కేంద్రబలగాలతో కూడిన ఫోటో ఒకటి వైరల్ గా మారింది. దీనిపై కొందరు పాజిటివ్ గా రియాక్టు అవుతుండగా.. మరికొందరు మాత్రం నెగిటివ్ గా స్పందిస్తున్నారు. అసలుసిసలు తెలుగు కల్చర్ ఉట్టిపడేలా ఉన్న ఆయన పంచె ఫోటో ఇప్పుడు తెగ వైరల్ గా మారింది.