టీడీపీ-జనసేన పొత్తులకు రెడీ అయ్యాయి. వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీలు కూడా కలిసి పనిచేస్తే.. గెలు పు తథ్యమనే ధీమాతోనూ ఉన్నాయి. ఇక, ఈ రెండు పార్టీల సంగతి ఇలా ఉంటే.. రాజకీయంగా కొన్ని సమస్యలు ఈ పొత్తులపై ప్రభావం చూపించే అవకాశం ఉందని అంటున్నారు పరిశీలకులు. ఉదాహరణ కు ఓ రెండు మాసాల కిందటి వరకు కూడా.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో పోరుకు సిద్ధమని ప్రకటిస్తూనే సొంత అజెండా ప్రకటించారు.
తాను ముఖ్యమంత్రి కాగానే తొలి సంతకం.. సుగాలి ప్రీతికి జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా, ఆమెకు ఆలంబనగా చేస్తానని ప్రకటించారు. రెండో సంతకం.. కౌలు రైతులకు సంబంధించిన మేలు కోసం చేస్తానన్నారు. మూడో సంతకం యువతకు ఉపాధి కల్పించేందుకు ఉంటుందని చెప్పారు. అంటే.. మొత్తంగా.. పవన్ సంతకాలు అప్పట్లో డిసైడ్ అయ్యాయి. కట్ చేస్తే.. ఇప్పుడు ఆయన టీడీపీతో పొత్తు అంటున్నారు.
ఇదే జరిగి రేపు ఇరు పార్టీలు అధికారంలోకి వస్తే.. పవన్ సంతకాల మాటేంటనే ప్రశ్న ఇప్పుడు మేధావుల మధ్చ చక్కర్లు కొడుతోంది. ఇదిలావుంటే.. మరోవైపు.. టీడీపీ కూడా మినీ మేనిఫెస్టో ప్రకటించింది. మహిళ లకు, యువతకు.. పెద్ద ఎత్తున నిధులు పంచే పథకాలకు శ్రీకారం చుట్టింది. అదేసమయంలో అభివృద్ధి మంత్రం కూడా పఠిస్తోంది. మరి వీటి మాటేంటి? పొత్తులు పెట్టుకున్న తర్వాత.. ఎవరి అజెండా వారిదే అన్నట్టుగా అమలు చేసేందుకు అవకాశం లేదు.
సో.. ఉమ్మడి కార్యాచరణ, ఉమ్మడి అజెండా అనేవి తెరమీదకి వస్తాయి. దీంతో ఆయా ప్రాధాన్యాలు కూడా మారిపోతుంటాయి. దీనిని బట్టి.. అటు పవన్ సంతకాలు, ఇటు టీడీపీ మినీ మేనిఫెస్టోలపై ఆశలు పెట్టుకున్న సాధారణ ప్రజానీకం పరిస్థితి ఏంటనేది ఇప్పుడు తెరమీదికి వచ్చిన ప్రశ్న. ఇవన్నీ ఇలా ఉంటే.. మరోవైపు బీజేపీని కూడా ఒప్పిస్తానని, పొత్తులకు చేతులు కలిపేలా చేస్తానని చెబుతున్న పవన్.. ఒకవేళ పొత్తులకు బీజేపీని ఒప్పించినా.. ఉచితాలకు వ్యతిరేకం అంటున్న ఆ పార్టీ ఉమ్మడి మేనిఫెస్టోపై ప్రభావం చూపించదా?! అప్పుడు టీడీపీ, జనసేనలు ఇచ్చిన హామీల పరిస్థితి ఎటు మలుపు తిరుగుతుంది? అనేది కూడా ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశంగా మారింది. మరి ఏం జరుగుతుందో చూడాలి.