లండన్ నుండి తిరిగివచ్చిన జగన్మోహన్ రెడ్డి బుధవారం సాయంత్రం ఢిల్లీకి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వారంరోజుల లండన్ పర్యటన నుండి జగన్ దంపుతులు సోమవారం అర్ధరాత్రి విజయవాడ చేరుకున్నారు. ఈరోజు ఉన్నతాధికారులతోను, ముఖ్యనేతలతోను జరుగుతున్న పరిణామాలపై సమీక్షిస్తారు. తర్వాత బుధవారం ఢిల్లీకి వెళ్ళబోతున్నారు. చంద్రబాబునాయుడు అరెస్టు, తర్వాత పరిణామాలతో పాటు పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెట్టబోయే బిల్లులపై ఢిల్లీ పెద్దలతో జగన్ చర్చిస్తారని పార్టీవర్గాలు చెప్పాయి.
జమిలి ఎన్నికలు, ముందస్తు ఎన్నికలే కీలకం అంశాలుగా చెబుతున్నారు. నరేంద్రమోడి, అమిత్ షా తో భేటీ ఉండబోతోందని సమాచారం. బుధ, గురువారాల్లో జగన్ ఢిల్లీలోనే ఉండబోతున్నట్లు పార్టీవర్గాలు చెప్పాయి. జమిలి ఎన్నికలు ఖాయమైతే ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ విషయాలపై జగన్ ఎక్కువగా దృష్టిపెట్టే అవకాశముంది. ఇక చంద్రబాబు అరెస్టుపైన కూడా మోడీ, అమిత్ షా కు బ్రీఫింగ్ ఇచ్చే అవకాశముందని సమాచారం.
జమిలి ఎన్నికలపైన ముందస్తు ఎన్నికలపైన ఇప్పటికే పార్టీలోని ముఖ్యనేతలకు జగన్ సంకేతాలు ఇచ్చినట్లు ప్రచారంలో ఉంది. దానికి ఢిల్లీ టూర్లో పూర్తి క్లారిటి వస్తుందని నేతలంతా అనుకుంటున్నారు. ఇప్పటివరకు ఎన్డీయేకి మద్దతు ఇస్తున్న జగన్ ఇక ముందు కూడా మద్దతు ఇస్తారనటంలో సందేహంలేదు. 18వ తేదీన మొదలై 22వ తేదీన ముగిసే ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు చాలా ప్రాధాన్యత వహించబోతున్నాయి. కామన్ సివిల్ కోడ్, వన్ నేషన్ వన్ యాక్ట్ లాంటి కీలక బిల్లులను మోడీ ప్రభుత్వం ప్రవేశపెడుతోందనే ప్రచారం అందరికీ తెలిసిందే.
ఇంతటి కీలకబిల్లులు పార్లమెంటులో పాస్ అవ్వాలంటే జగన్ మద్దతు ఎన్డీయే ప్రభుత్వానికి చాలా అవసరం. లండన్ వెళ్ళేముందు మోడీ, అమిత్ షా అపాయిట్మెంట్లను జగన్ తీసుకున్నట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి. కాబట్టి రెండురోజుల ఢిల్లీ పర్యటన చాలా కీలకమనే చెప్పాలి. మరి ఢిల్లీ పర్యటన అనంతర పరిణామాలు ఎలాగుంటాయో అనే ఆసక్తి అందరిలోను పెరిగిపోతోంది. ఏదేమైనా చంద్రబాబు అరెస్టు, రిమాండు నేపధ్యంలో తలెత్తిన పరిణామాలను జగన్ ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాలి.