వచ్చిన దరఖాస్తులు చూసిన తర్వాత కాంగ్రెస్ సీనియర్లలో ఉదయ్ పూర్ డిక్లరేషన్ టెన్షన్ పెరిగిపోతోంది. ఒకవైపు ఇన్ని దరఖాస్తులు వచ్చినందుకు సంతోషించాలా ? లేకపోతే వీటిని వడపోసి అభ్యర్ధలను ఎంపికచేయటంలో ఉండే కష్టాలను చూసి భయపడాలో అర్ధంకావటంలేదు. ఇంతకీ ఉదయ్ పూర్ డిక్లరేషన్ ఏమిటంటే కుటుంబానికి ఒక్క టికెట్ అని. రాజస్ధాన్లోని ఉదయ్ పూర్లో జరిగిన ప్లీనరీ సమావేశంలో ఈ డిక్లరేషన్ చేశారు. దీన్ని దేశవ్యాప్తంగా అమలుచేయాని నిర్ణయించారు.
ఇపుడా డిక్లరేషనే పార్టీ నేతలకు ముచ్చెమటలు పట్టిస్తోంది. ఈమధ్యనే జరిగిన కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఉదయపూర్ డిక్లరేషన్ను అమలు చేశారట. అయితే అదే డిక్లరేషన్ను తెలంగాణాలో అమలు చేయగలరా ? అన్నదే అసలైన సమస్య. ఎందుకంటే కర్నాటకలో 230 సీట్లుంటే తెలంగాణాలో ఉన్నది 119 సీట్లు మాత్రమే. 119 సీట్లకు సుమారు 1010 దరఖాస్తులు వచ్చాయి. తండ్రి-కొడుకులు, అన్నా-దమ్ముళ్ళు, అన్నా-చెల్లెళ్ళు, తల్లీ-కొడుకులు ఇలాంటి కాంబినేషన్లో చాలా దరఖాస్తులు వచ్చాయట.
వచ్చిన దరఖాస్తులను వడపోయటమే ప్రదేశ్ ఎన్నికల కమిటీకి పెద్ద తలనొప్పిగా తయారైందట. దరఖాస్తులను వడబోసి తర్వాత ఫ్యామిలీ ప్యాకేజీలను విడదీసి తర్వాత నిర్ణయం తీసుకోవటమే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు సీనియర్లకు తలకుమించిన పనవుతోంది. వీలైనంతమంది సీనియర్లకు టికెట్లను సర్దుబాటు చేయాలంటే ఉదయపూర్ డిక్లరేషన్ను అమలు చేయటం మినహా మరో మార్గంలేదు. ఆ డిక్లరేషన్ను అమలుచేస్తే చాలామంది సీనియర్లకు మండిపోవటం ఖాయం.
దాంతో ఏమిచేయాలో అర్ధంకాక ప్రదేశ్ ఎన్నికల కమిటి తలలు పట్టుకుంటోంది. అందుకనే దరఖాస్తుల వడబోత అయిపోయిన తర్వాత అభ్యర్ధులను ఫైనల్ చేసే వేదికను మార్చేయాలని అనుకుంటున్నారట. వేదికను గాంధీభవన్ నుండి ఢిల్లీకి మార్చాలని అనుకుంటున్నారట. ఢిల్లీ నుండి అభ్యర్ధుల ప్రకటన జరిగితే గాంధీభవన్ పై ఒత్తిడి తగ్గుతుందని సీనియర్లు అనుకుంటున్నారట. మరి ఉదయపూర్ పార్టీలో ఏ స్ధాయిలో చిచ్చుపెడుతుందో అని సీనియర్లలో టెన్షన్ పెరిగిపోతోంది. మరి చివరకు ప్రదేశ్ ఎలక్షన్ కమిటి ఉదయ్ పూర్ డిక్లరేషన్ను ఎలా హ్యాండిల్ చేస్తుందో చూడాలనే ఆసక్తి పెరిగిపోతోంది.