మెసపటోనియా నాగరికత నుంచి మూసీనది వరకు… నదుల పక్కనే నాగరికత అభివృద్ధి చెందింది. నది జీవితాలకు, సంస్కృతులకు జీవనాడి. ఆంధ్రప్రదేశ్ రాజధాని ‘అమరావతి’ కృష్ణానది తీరానికి అనుకుని ఉండటం వలన భవిష్యత్తులో వరదలు వస్తే మునిగిపోయే ప్రమాదం ఉందని చాలాకాలం నుంచి ఓ వాదన ఉన్న సంగతి తెలిసిందే.
అందుకే, నదీ పరివాహక ప్రాంతంలో రాజధాని అమరావతి నిర్మాణం సరైన నిర్ణయం కాదని కొందరు అధికార పార్టీ నేతలు విమర్శించారు. దాంతోపాటు ఇతరత్రా కారణాలు చూపుతూ పాలనా రాజధానిగా విశాఖను ప్రస్తుతం అధికారంలో ఉన్న జగన్ సర్కార్ నిర్ణయించింది. అది కోర్టులో ఆగిందనే విషయాన్ని పక్కన పెడితే… అసలు అమరావతిలో లేనిదేమిటి? విశాఖలో ఉన్నదేమిటి? అన్న చర్చ ప్రజల్లో జరుగుతోంది.
ప్రపంచంలో ఎన్నో ప్రముఖ పట్టణాలు, నగరాలు నదీ తీరం వెంబడే ఉన్నాయని, నదీ పరివాహక ప్రాంతాల్లో కొన్ని శతాబ్దాలుగా అత్యున్నతమైన నాగరికత వెల్లివిరిసిందని చర్చించుకుంటున్నారు. కృష్ణమ్మ చెంతనే ఉండటం ‘అమరావతి’కి మైనస్ కాదు, కచ్చితంగా ప్లస్ అవుతుంది అన్నది విశ్లేషకుల అభిప్రాయం. కానీ నదీ జలాలు అందుబాటులో లేని విశాఖ రాజధాని అయితే భవిష్యత్తులో పెరిగే జనాభా వల్ల అక్కడి ప్రజలకు తాగునీటి కష్టాలు తప్పవని చర్చ జరుగుతోంది.
ప్రపంచంలోని చాలా మహానగరాలు నదీతీరంలో కట్టినవేనని చరిత్ర చెప్పిన నిజం. మన దేశంలోనూ ఢిల్లీ(యమున), హైదరాబాదు (మూసీ), కలకత్తా(హుగ్లీ) వంటి మహానగరాలన్నీ నదీతీరాల్లో నిర్మించినవే. అందుకే, ఆయా నగరాలకు తాగునీటి కష్టాలు తక్కువని అనుకుంటున్నారు.
ఇక, ముంబై, చెన్నై సముద్రం పక్కన ఉన్నప్పటికీ తాగునీటి కష్టాలు ఎంత దారుణంగా ఉన్నది మనం చూస్తూనే ఉన్నాం. హైదరాబాదు కూడా మూసీ పదిలంగా ఉన్నంత కాలం అద్భుతంగా ఉంది… మళ్లీ కృష్ణా నీరు వచ్చాక, ఆ తర్వాత గోదావరి తెచ్చాక దాని ప్రాభవం పెరిగింది. కానీ ఇది ఎంతో వ్యయప్రయాసలతో మూడు దశాబ్దాలు పట్టింది పూర్తవడానికి.
అమరావతి విషయానికి వస్తే దానికి ఉన్న నీటి వనరులు పుష్కలం. అది అన్నిరకాలుగా బలం. టూరిజానికి కూడా కీలకం అయ్యే అవకాశం ఉంది. విశాఖకు ఈ సదుపాయం లేదు. సముద్రతీరంలోని విశాఖలో రాజధాని పెట్టడం వల్ల నీటి కష్టాలు వచ్చే ప్రమాదం ఉంటుందని ప్రజలు అనుకుంటున్నారు. రాజధాని పేరుతో విశాఖను విస్తరిస్తే భవిష్యత్తులో నీటికోసమే విశాఖవాసులు చాలా డబ్బులు ఖర్చుపెట్టాల్సి వస్తుందని అభిప్రాయపడుతున్నారు. తాజాగా ప్రభుత్వం ఉప్పు నీటిని మంచినీటిగా మార్చే టెక్నాలజీ గురించి చర్చిస్తున్నట్లు వార్తలు కూడా వచ్చాయి.
ఇక దీనికి తోడు తీర ప్రాంతమైన విశాఖకు తుపాన్ల ముప్పు అధికమని, హుద్ హుద్ వంటి తుపాన్లు ఇప్పటికే విశాఖకు ఎంత ప్రమాదాన్ని కలుగజేశాయో చూశాం. అందుకే, కృష్ణా నదీ పరీవాహక ప్రాంతమైన అమరావతి…అన్ని విధాలుగా రాజధానికి అనుకూల ప్రాంతమని అనుకుంటున్నారు. ఇటువంటి అభిప్రాయాలు విన్నపుడు….రాజధానిపై ప్రజాభిప్రాయ సేకరణ చేపడితే బాగుంటుందన్న ఆలోచన కలుగక మానదు.