సీఎం జగన్ హయాంలో టీటీడీ ప్రతిష్ట మసకబారుతోందని టిడిపి సహా ప్రతిపక్ష పార్టీలన్నీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అన్యమత ప్రచారం మొదలుకొని టీటీడీ నూతన చైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డి నియామకం వరకు జగన్ ప్రభుత్వంపై, టీటీడీపై ఎన్నో విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా భూమన నియామకం వ్యవహారంపై ప్రతిపక్ష నేతలు విమర్శలు దూకుడు పెంచారు. అన్యమతస్థుడైన కరుణాకర్ రెడ్డికి ఆ పదవి కట్టబెట్టడం ఏమిటని ప్రతిపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు. హిందువుల మనోభావాలను వైసీపీ ప్రభుత్వం దెబ్బతీస్తోందని ఆరోపిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే తనపై వస్తున్న విమర్శలకు కరుణాకర్ రెడ్డి క్లారిటీనిచ్చే ప్రయత్నం చేశారు. తాను నాస్తికుడినని, క్రిస్టియన్ అని తనపై వస్తున్న విమర్శలకు భూమన కౌంటర్ ఇచ్చారు. ఆ విమర్శలకు తాను భయపడే వాడిని కాదని భూమన స్పష్టం చేశారు. 17 ఏళ్ల కింద టీటీడీ చైర్మన్ గా తాను పనిచేశానని గుర్తు చేసుకున్నారు. 30 వేల మందికి కళ్యాణమస్తు ద్వారా సామూహిక వివాహాలు చేయించానని అన్నారు. అన్నమయ్య 600వ వర్ధంతి ఉత్సవాలు చేసింది కూడా తానే అని అన్నారు.
దళితవాడలకు శ్రీ వెంకటేశ్వర స్వామిని తీసుకువెళ్లి కళ్యాణం చేయించానని, తిరుమల ఆలయ నాలుగు మాడ వీధులలో చెప్పులు వేసుకుని తిరగకూడదన్న నిర్ణయం కూడా తనదేనని అన్నారు. తనపై క్రిస్టియన్ ముద్ర వేస్తున్న వారికి ఇదే తన సమాధానం అని చెప్పారు. అయితే, ఎవరో ఆరోపణలు చేస్తున్నారని మంచి పనులు చేయడం ఆపే వాడిని తాను కాదని భూమన అన్నారు. పోరాటాల నుంచి పైకి వచ్చిన వాడినని, ఇటువంటి వాటికి భయపడే ప్రసక్తే లేదని చెప్పారు.
ఇక, తిరుమల శ్రీవారిపై ఉన్న భక్తి విశ్వాసాలను దెబ్బతీసేలా సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ నాలుగేళ్లలో చేసిన అభివృద్ధి, భక్తుల వసతుల కల్పనపై నెల రోజుల్లో ప్రదర్శన ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates