గన్నవరం నియోజకవర్గంలో పంచాయితి జగన్మోహన్ రెడ్డికి కాస్త తలనొప్పిగానే తయారైంది. ఈమధ్యనే యార్లగడ్డ వెంకటరావు పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. పెద్ద తలనొప్పి వదిలిపోయిందని అనుకుంటే దుట్టా రామచంద్రరావు రూపంలో మళ్ళీ మొదలైంది. 2014లో వైసీపీ నుండి పోటీచేసి ఓడిపోయింది దుట్టానే. 2019లో యార్లగడ్డ చివరి నిముషంలో వచ్చి టికెట్ తీసుకుని ఓడిపోయారు. రెండు ఎన్నికల్లో ఇద్దరిపైన గెలిచిన వల్లభనేని వంశీ మారిన రాజకీయ పరిణామాల్లో జగన్ కు దగ్గరయ్యారు.
అనేక సమీకరణలను పరిశీలించిన తర్వాత వంశీకే జగన్ టికెట్ ప్రకటించారు. దాన్ని నచ్చని యార్లగడ్డ దుట్టాతో కలిసి చాలా గొడవలే చేశారు. అయితే ఎంత గొడవచేసినా ఉపయోగం లేకపోవటంతో చేసేదిలేక చివరకు పార్టీనే వదిలేశారు. ఇపుడు దుట్టా పాత్ర ఏమిటనేది అర్ధంకావటంలేదు. వంశీ మీద దుట్టాకు కూడా బాగా కోపముంది. అందుకనే యార్లగడ్డ పార్టీని వదిలేయగానే జగన్ స్వయంగా దుట్టా కుటుంబాన్ని పిలిపించుకుని మాట్లాడారు.
తర్వాత మీడియాతో మాట్లాడిన దుట్టా కూడా జగన్ నాయకత్వంపై విశ్వాసం ప్రకటించారు. పార్టీ మారేది లేదని చెప్పారు. అయితే తర్వాత ఏమైందో తెలీటంలేదు. అందుకనే మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరిని దుట్టాతో మాట్లాడేందుకు పంపించారు. దుట్టాతో ఎంపీ చాలాసేపు ఏకంతంగా మాట్లాడారు. ఎంపీ రాయబారం ఫలించిందనే పార్టీలో ప్రచారం జరుగుతోంది. ఎంపీతో భేటీ తర్వాత దుట్టా అయితే ఏమీ మాట్లాడలేదు.
ఇక్కడే దుట్టా వైఖరిపై అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఒకవైపు షెడ్యూల్ ఎన్నికలు దగ్గరకు వచ్చేస్తున్నాయి మరోవైపు దుట్టా వైఖరి అనుమానంగా ఉంది. దాంతో గన్నవరంలో ఏమి జరుగుతోందో అర్ధంకావటంలేదు. నియోజకవర్గంలో దుట్టాకు కూడా పట్టుదనే చెప్పాలి. జగన్ మాటవిని వంశీకి మద్దతుగా దుట్టా పనిచేస్తే ఫలితం ఒకలాగుంటుంది. కాదని వ్యతిరేకం చేస్తే ఫలితం ఎలాగుంటుందనేది సస్పెన్సుగా మారింది. అందుకనే గన్నవరం రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తోంది. మరి దుట్టా ఏమిచేస్తారో చూడాల్పిందే.
Gulte Telugu Telugu Political and Movie News Updates