తెలంగాణ ఎన్నికలకు సిద్ధమవుతున్న కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ పెట్టింది. టికెట్ ఆశిస్తున్న ఆశావహుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించే ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. అలా వచ్చిన దరఖాస్తులను పరిశీలించేందుకు ఇక్కడ రాష్ట్రంలో టీపీసీసీ, స్క్రీనింగ్ కమిటీ ఉన్నాయి. ఆ తర్వాత జాతీయ స్థాయిలో మరో స్క్రీనింగ్ కమిటీ ఉంది. చివరకు అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుంది. కానీ ఇవేమీ తనకు అవసరం లేదన్నట్లు కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే స్థానాన్ని ప్రకటించేసుకున్నారు. అంతే కాకుండా తన భార్య పోటీ చేసే నియోజకవర్గాన్ని కూడా వెల్లడించడం గమనార్హం.
ఈ సారి తెలంగాణ ఎన్నికల్లో అసెంబ్లీ స్థానానికి పోటీ చేయాలనే ఉద్దేశంతో ఉత్తమ్ ఉన్నారు. తాజాగా సూర్యపేట జిల్లా హుజూర్ నగర్ నుంచి పోటీ చేయబోతున్నట్లు ఉత్తమ్ ప్రకటించారు. తన భార్య పద్మావతి రెడ్డి కోదాడ నుంచి పోటీలోకి దిగుతుందని కూడా ఆయన వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీలో సభ్యుడిగా ఉన్న ఉత్తమ్ ఇలా నేరుగా పోటీ చేసే స్థానాలను ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.
ఉత్తమ్ కాంగ్రెస్ను వీడి బీఆర్ఎస్లో చేరబోతున్నారని ఇటీవల గట్టిగా ప్రచారం సాగింది. కానీ అలాంటిదేమీ లేదని ఉత్తమ్ పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో తనతో పాటు భార్య కూడా కాంగ్రెస్ అభ్యర్థులగానే పోటీ చేస్తామని స్పష్టం చేశారు. తాజాగా పోటీ చేసే స్థానాలనూ వెల్లడించారు. మరి అధిష్ఠానం నుంచి ఈ మేరకు ఉత్తమ్కు హామీ దక్కిందా? లేదా టికెట్లు ఇవ్వాల్సిందేనని ఆయన డిమాండ్ చేస్తున్నారా? అన్నది ఆసక్తికరంగా మారింది.