వైసీపీకి గన్నవరం కీలక నేత యార్లగడ్డ వెంకట్రావు గుడ్ బై చెప్పారు. ఈ మేరకు శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించి అధికారికంగా ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను అవమానాలను ఎదుర్కోవడానికే రాజకీయాల్లోకి వచ్చినట్లయిందని మీడియా ముందు వాపోయారు.
వైసీపీలో ఉండగా ఒక్కసారి కూడా ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడిని కలవలేదన్నారు. కలిశానని ముఖ్యమంత్రి నమ్మితే అది ఇంటిలిజెన్స్ వైఫల్యమేనని యార్లగడ్డ పేర్కొన్నారు. ఇప్పుడు బహిరంగంగా చెబుతున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అపాయింట్ మెంట్ తీసుకుని తెలుగుదేశం పార్టీలో చేరతానని యార్లగడ్డ తేల్చి చెప్పారు.
తెలుగుదేశం పార్టీ టికెట్ ఇస్తే గన్నవరం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తానని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో నేను గన్నవరం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో నీకు ఎదురు పడతానని సీఎం జగన్ కి సవాల్ విసిరారు యార్లగడ్డ వెంకట్రావు. సీఎం జగన్ ను టిక్కెట్ ఇవ్వాలని మాత్రమే అడిగానని తెలిపారు. పార్టీ పెద్దలకు ఏం అర్థమైందో ఏమో తనకు తెలియలేదని చెప్పారు. తనను ఎక్కడైనా పార్టీ సర్దుబాటు చేస్తుందని సజ్జల ప్రకటన చేస్తే బాగుండేదని అన్నారు.
కానీ పార్టీలో ఉంటే ఉండు.. పోతే పొమ్మని సజ్జల చెప్పడంతో తనకు చాలా బాధ, ఆవేదన కలిగాయని అన్నారు. టీడీపీ కంచుకోటలో తాను ఢీ అంటే ఢీ అని పోరాడానని గుర్తు చేశారు. ఆ బలమే ఇప్పుడు బలహీనత అయిందా? అని ప్రశ్నించారు. టీడీపీలో గెలిచిన అభ్యర్థిని తెచ్చుకోవడం మీకు బలంగా మారిందా అని నిలదీశారు యార్లగడ్డ.
తడి గుడ్డతో గొంతు కోయడం అనేది తన విషయంలో నిజమైందని ఆవేదన వ్యక్తం చేశారు. నమ్మిన మనిషిని కాపాడాల్సిన బాధ్యత ఏ పార్టీకైనా ఉంటుందని అన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates