151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఏం లాభం..? తిని తిరుగుతున్నారు. అమాయకుల భూములు దోస్తు న్నారు. ఏమైనా అంటే ఎదురు తిరిగి కొడుతున్నారు. కేసులు పెడుతున్నారు. వీళ్ల వల్ల మనకు ఒరిగిందేంటి? అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో పనిచేసే ముఖ్యమంత్రి అవసరమని.. అబద్ధాలు చెబుతూ.. ప్రజల సొమ్మును ఆబగా మేసే ముఖ్యమంత్రి అవసరం లేదని అన్నారు.
వచ్చే ఎన్నికల్లో అయినా.. ప్రజలు ఈ విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించాలని.. ఎవరు పనిచేస్తున్నారో.. గమనించి.. ఎవరు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్లాలని భావిస్తున్నారో తెలుసుకుని వారికి ఓటేయాలని, వారిని గెలిపించాలని సూచించారు. తనతో సహా ఎవరైనా సరే.. ఓటర్లు ఇదే సూత్రం పాటించాలని పవన్ వ్యాఖ్యానించారు.
అమ్మ ఒడి రాజ్యాంగ హక్కు
అమ్మ ఒడి అనే పథకంపై పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ పథకం జగన్ ఇస్తున్నది కాదన్నారు. ఇది రాజ్యాంగబద్ధంగా కల్పించిన హక్కు అని పేర్కొన్నారు. ఈ విషయం తెలియక ప్రజలు జగన్ తమకు ఏదో ఇస్తున్నారని..వ్యాఖ్యానిస్తున్నారని.. నమ్ముతున్నారని.. ఇప్పటికైనా క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోందో తెలుసుకోవాలని సూచించారు.
జగన్‌పై 30 కేసులు
రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసే వ్యక్తి వైట్ పేపర్ మాదిరిగా ఉండాలని.. పెద్దలు అనేక సందర్భాల్లో చెప్పారని పవన్ చెప్పారు. కానీ, రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్‌పై 30 కేసులు ఉన్నాయని.. ఇవి అత్యంత అవినీతి కేసులని వ్యాఖ్యానించారు. ఏ కారణం లేకుండానే 16 నెలలు జైల్లో కూర్చోబెడతారా? అని ప్రశ్నించారు. అలాంటి వ్యక్తి కూడా కోర్టులను దూషిస్తారని, హైకోర్టు, సుప్రీంకోర్టులను కూడా తప్పు పట్టే స్థాయికి వెళ్లిపోయారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates