ఏపీ రాజకీయాల్లో వేడివేడిగా ఉన్న నియోజకవర్గం ఏదైనా ఉంది అంటే అది గన్నవరం నియోజకవర్గమే. ఇక నుంచి గన్నవరం నియోజకవర్గంలోనే కొనసాగుతాను అంటున్నారు వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు. రానున్న ఎన్నికల్లో గన్నవరం నుంచే కచ్చితంగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని తేల్చి చెప్పారు. గన్నవరంలో నిర్వహించిన అనుచరులు, కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
సీఎంని గన్నవరం సీటు ఇవ్వాలని కోరతానని పేర్కొన్నారు. రెండు సంవత్సరాల నుంచి జగన్ అపాయింట్‌మెంట్ దొరకడం లేదని తెలిపారు.ఎలాంటి పరిణామాలు జరిగినా గన్నవరం నుంచే బరిలో దిగాలని నిర్ణయించుకున్నానిని తేల్చేశారు. వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉన్నా కార్యకర్తలపై కేసులు తీయలేదని.. జగన్ తమ రాజకీయ భవిష్యత్ కు భరోసా ఇచ్చి గన్నవరం తీసుకువచ్చారన్నారు.
తాను రాక ముందు ఇక్కడ పార్టీ పరిస్థితి ఏంటో ఇక్కడి వారికే బాగా తెలుసన్నారు. గత ఎన్నికల్లో దురదృష్టం, విధి వంచించటం వల్ల ఓడిపోయానని.. టెన్త్ క్లాస్ చదువుకునే రోజుల్లోనే తాను ఎమ్మెల్యే అవ్వాలని మనసులో ఉండేదన్నారు. వల్లభనేని వంశీతో తనకు ఎలాంటి తగాదాలు లేవని.. వంశీతో కలిసి పనిచేయలేనన్నట్లు తాను సీఎం జగన్‌కి చెప్పానన్నారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్ధిగా తాను పోటీ చేయటం వల్లే వంశీకి శత్రువుగా మారానన్నారు. తాను ఎమ్మెల్యేగా ఓడినా.. పార్టీ అధికారంలో ఉందని నియోజకవర్గ ప్రజల సమస్యలను పరిష్కరిద్దామని భావించానన్నారు.
తనను క్రాస్ రోడ్డులో వదలనని జగన్ తనతో చెప్పారని.. కానీ ఇప్పుడు నడిరోడ్డు మీద ఉన్నట్లు యార్లగడ్డ వ్యాఖ్యానించారు. మరోవైపు తనను దుట్టా రామచంద్రరావు డొక్క చించి డోలు కడతారని తిట్టినా పార్టీ స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో అవమానాలు భరించానని.. తాను మాత్రం జగన్‌ను ఏమీ అనలేదన్నారు. కొద్దిరోజులుగా వెంకట్రావు టీడీపీలో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన ఆత్మీయ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. గన్నవరం నుంచి మాత్రం పోటీచేసేది ఖాయం అంటున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates