ఏపీలో పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం ఇప్పటికే పలు మార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇళ్ల స్థలాల పంపిణీకి చేపట్టిన భూసేకరణ అంశంలో ఏపీ ప్రభుత్వానికి ఇప్పటికే హైకోర్టులో పలుమార్లు ఎదురుదెబ్బలు తగిలాయి. రాష్ట్రంలోని మైనింగ్ భూము మైనింగ్ భూములపై కేంద్ర ప్రభుత్వానికే అధికారం ఉంటుందని, వాటిని ఇతర అవసరాలకు వాడకూడదని హైకోర్టు వ్యాఖ్యానించింది.
రాష్ట్రంలో పలు చోట్ల మైనింగ్ భూములను ఇళ్ల పట్టాల పంపిణీ కోసం కేటాయించారని దాఖలైన పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు.. వాటిపై స్టే ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే తాజాగా మరోసారి జగన్ సర్కార్ కు హైకోర్టులో చుక్కెదురైంది. ఏపీలో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీలకు సంబంధించిన స్థలాలను ఇళ్ల పట్టాల కోసం ఇవ్వొద్దని హైకోర్టు ఆదేశించింది. ఈ ప్రకారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు…దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఏపీలోని పేదలకు ఇళ్లు ఇచ్చే ఉద్దేశ్యంతో దాదాపు 26లక్షలకు పైగా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అన్నారు. అందుకోసం, దాదాపు 90 వేల కోట్ల భారీ మొత్తం ఖర్చు చేయబోతున్నామని తెలిపారు. ఏపీలోని పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమానికి హైకోర్టు అడ్డంకులు సృష్టిస్తోందని నారాయణ స్వామి అన్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా హైకోర్టు మరోసారి ఇళ్ల స్థలాల పంపిణీకి బ్రేక్ వేసింది.
దివంగత సీఎం ఎన్టీఆర్ హయాంలో 1989లో తెలుగు విశ్వవిద్యాలయం రాజమండ్రి క్యాంపస్ కు 45 ఎకరాల భూమి కేటాయించారు. ఇళ్ల స్థలాల పంపిణీ కోసం అందులో 20 ఎకరాలు తిరిగి తీసుకునేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాజమండ్రిలోని తెలుగు విశ్వవిద్యాలయంలో ఖాళీగా ఉన్న స్థలాన్ని పేదలకు ఇళ్ల స్థలాల కోసం తీసుకోవడం సరికాదని దాఖలైన పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిపింది. యూనివర్సిటీకి చెందిన 20ఎకరాల భూమిని ఇళ్ల స్థలాలకు కేటాయించాలన్ని నిర్ణయాన్ని హైకోర్టు తప్పుబట్టింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలోని పదో షెడ్యూల్లో ఉన్న తెలుగు యూనివర్సిటీని ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు ఇంకా విభజించుకోలేదని, కాబట్టి ఆ స్థలాన్ని పంపిణీ చేయడం సరికాదని హైకోర్టు అభిప్రాయపడింది.దీంతోపాటు, విశాఖపట్నం జిల్లా అనంతగిరి మండలంలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ భూములను ఇళ్ల పట్టాలకు ప్రభుత్వం కేటాయించడంపై హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలైంది. ఈ పిల్ ను విచారణ జరిపిన హైకోర్టు ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టింది. రాష్ట్రంలో ఎక్కడా విద్యా సంస్థల భూములు ఇళ్ల పట్టాలకు ఇవ్వొద్దని ఆదేశాలు జారీ చేసింది.