సోనియా వల్లే కాలేదు.. నువ్వెంత పవన్?: రోజా

వైసిపి నేతల అవినీతి చిట్టా తన దగ్గర ఉందని, దాని సాయంతో కేంద్ర ప్రభుత్వం ద్వారా జగన్ ను ఓ ఆట ఆడిస్తానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాలలో పెను దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ పై వైసీపీ నేతలు మాటల దాడి మొదలుబెట్టారు. ఈ క్రమంలోనే పవన్ పై మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. తన సినిమాను నాలుగు ఆటలు ఆడించుకోలేక చతికిల పడ్డ బ్రో పవన్… జగన్ ను ఆడిస్తాడంట అని ఎద్దేవా చేశారు.

జగన్ ను ఆడించడం, ఓడించడం దేశాన్ని గడగడలాడించిన సోనియా గాంధీ వల్లే కాలేదని రోజా అన్నారు. చంద్రబాబు ఆడుతున్న రాజకీయ ఆటలో పవన్ అరటిపండు అని, అటువంటి పవన్… జగన్ ను ఏం ఆడిస్తాడని ఎద్దేవా చేశారు. చంద్రబాబు చెప్పిన మాటలు,ఎల్లో మీడియా రాసిచ్చిన స్క్రిప్ట్ చదవడం తప్ప పవన్ కు ఏమీ రాదని చురకలంటించారు. చంద్రబాబు మాట్లాడింది పవన్ కూడా మాట్లాడతారని, ఈనాడు, ఆంధ్రజ్యోతిలో వచ్చింది చెబుతుంటారని ఎద్దేవా చేశారు.

జనసేనకు జెండా, ఎజెండా లేవని చెప్పుకొచ్చారు. ప్రజారాజ్యం, జనసేనలను నమ్ముకున్న వారి కోసం ఇది చేశామని చెప్పే పరిస్థితి లేదని అన్నారు. చంద్రబాబుకు ఓటు వేయాలి అని పవన్ పరోక్షంగా అభ్యర్థిస్తున్నట్లు కనిపిస్తోందని అన్నారు. మీ తల్లిని, కార్యకర్తలను తిడితే కనీసం పట్టించుకోలేదని, ప్యాకేజీ కోసం పవన్ లొంగుతారని ఎద్దేవా చేశారు. బాలకృష్ణ ఇంటర్వ్యూకి పవన్ వెళ్తారని, చంద్రబాబు ఇంటికి వెళ్తారని, టిడిపికి ఓటు వేయమని కూడా చెబుతారని…ఇదేనా జనసేన రాజకీయం అని ప్రశ్నించారు. చంద్రబాబు మొరగమంటే మొరుగుతూ కరవమంటే కరుస్తూ ఒక వింత జీవిలా దత్తుపుత్రుడు పవన్ తయారయ్యాడని సంచలన వ్యాఖ్యలు చేశారు.