ముఖ్య నేతలతో అంతర్గత భేటీ!

పార్టీ ముఖ్య నేతలతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుక్రవారం అంతర్గత సమావేశం కానున్నారు. రుషి కొండ, ఎర్రమట్టి కొండలు సహా వివాదాస్పద భూములకు సంబంధించిన అంశాలపై ప్రధానంగా ఈ సమావేశంలో జనసేనాని చర్చించనున్నారు. అలాగే వైజాగ్ లో ఉన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించే అవకాశం ఉంది. అయితే పవన్ ఫీల్డ్ విజిట్స్ పై ఉత్కంఠ నెలకొంది. ముందస్తు సమాచారం, అనుమతి లేకుండా పవన్ కళ్యాణ్ ఎక్కడికీ వెళ్ల రాదని ఆంక్షలు విధించారు పోలీసులు. అలాగే వైజాగ్ లో వారాహి విజయోత్సవ రెండో రోజు పర్యటనకు సంబంధించి షెడ్యూల్ ను జనసేన టీమ్ రిలీజ్ చేయనుంది. ఇక విశాఖ పర్యటనలో పలువురు పార్టీలో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది.

కాగా వైజాగ్ లో వారాహి మూడో దశ యాత్రను గురువారం పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. ఈ యాత్రకి వినూత్న స్పందన వచ్చింది. జగదాంబ సెంటర్ లో అభిమానులు, జనసేన కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కావాలని తాను అనుకుంటే సరిపోదని.. మీరు కూడా దానికి సపోర్ట్ చేయాలని అన్నారు. నేను వైసీపీ గురించి ఒక్క మాట మాట్లాడితే వారు గయ్యిన లేస్తున్నారని విమర్శించారు. దోపిడీలు చేసే వాళ్లకే ఇంత ధైర్యం ఉంటే రాజ్యాంగ స్ఫూర్తితో నడుస్తున్న నాకు ఇంకేంత ధైర్యం ఉండాలని జనసేనాని ప్రశ్నించారు.

వైసీపీని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నుంచి తరిమికొట్టే వరకూ.. నేను ఉరుకోను అని పవన్ కళ్యాణ్ అన్నారు. వైసీపీ పార్టీ నుంచి రాష్ట్రానికి విముక్తి కలిగిస్తానని ఆయన చెప్పుకొచ్చారు. సింహద్రి సాక్షి చెప్తున్నా.. వాలంటీర్లను నేను తప్పపట్టడం లేదు.. వారి మీద ద్వేషమూ లేదు. వాలంటీర్లతో జగన్ తప్పులు చేయిస్తున్నాడని అన్నారు. గంజాయికి అడ్డగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మారిపోయిందన్నారు. కేంద్రంతో ఒక రోజు జగన్ ను ఆట ఆడిస్తానని పేర్కొన్నారు పవన్. జగన్ కి మరొక అవకాశం ఇస్తారా? లేదో ఆలోచించుకోండని అన్నారు. గత పర్యటనలో మీరు లేకపోతే వైజాగ్ లో తనను ఏమైనా చేసే వారని అన్నారు. ఈ నేల కోసం ప్రాణాలకు తెగించే వారు కావాలన్నారు పవన్ కళ్యాణ్.