పొత్తుపైనే పొన్నాడ భవిష్యత్తు ఆధారపడుందా ?

రాబోయే ఎన్నికలకు సంబంధించి మూడు అంశాలు జనాల్లో విపరీతంగా చర్చ జరుగుతున్నాయి. మొదటిదేమో టీడీపీ-జనసేన మధ్య పొత్తుంటుందా ఉండదా ? అని. రెండో అంశం ఏమిటంటే పొత్తుంటే లాభం ఎవరికి ? నష్టం ఎవరికి అని. మూడో అనుమానం ఏమిటంటే టీడీపీ, జనసేన పొత్తుల్లో పోటీచేయబోయే నియోజకవర్గాలు ఏవని. మిగిలిన నియోజకవర్గాల సంగతిని పక్కనపెట్టేసినా ఉమ్మడి తూర్పుగోదావరి జల్లాలోని ముమ్మిడివరం నియోజకవర్గంలో పై అంశాలపై బాగా చర్చలు జరుగుతున్నాయి.

దీనికి కారణం ఏమిటంటే సిట్టింగ్ ఎంఎల్ఏ పొన్నాడ సతీష్ గెలుపు అవకాశాలే. పొన్నాడ ఇప్పటికి రెండుసార్లు గెలిచారు. రెండుసార్లు కూడా చాలా తక్కువ మెజారిటితోనే గెలిచారు. రెండుసార్లు కూడా నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏమిటంటే ప్రత్యర్ధుల మధ్య ఓట్ల చీలిక వల్లే పొన్నాడ గెలిచారని. 2009లో కాంగ్రెస్ తరపున పొన్నాడ పోటీచేస్తే టీడీపీ తరపున దాట్ల సుబ్బరాజు, పీఆర్పీ తరపున కుడిపూడి సూర్యనారయణ పోటీచేశారు. దాట్ల, కుడిపూడి మధ్య ఓట్లు చీలిపోవటం వల్ల పొన్నాడ గెలిచారు.

ఇక 2019లో వైసీపీ తరపున పొన్నాడ పోటీచేస్తే టీడీపీ తరపున దాట్ల సుబ్బరాజు, జనసేన తరపున పితాని బాలకృష్ణ పోటీచేశారు. వీళ్ళమధ్య ఓట్లు చీలిపోయిన కారణంగా మళ్ళీ పొన్నాడే గెలిచారు. అంటే ముమ్మిడివరంలో పోటీ త్రిముఖం కాకుండా ఫేస్ టు ఫేస్ అయితే పొన్నాడ గెలుపు కష్టమనే చర్చలు జోరుగా జరుగుతోంది. ఇందుకనే రేపటి ఎన్నికల్లో టీడీపీ-జనసేన పొత్తుంటుందా ఉండదా అన్న చర్చ ఎక్కువగా జరుగుతోంది.

పొన్నాడ కూడా తక్కువోడేమీ కాదు. నేతల మద్దతు, క్యాడర్ బలం ఉన్న నేతనేచెప్పాలి. ఇదే సమయంలో తమ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమపథకాలతో తాను గెలుస్తానని బలంగా నమ్ముతున్నారు. పైగా ఒకపుడు పీఆర్పీ తరపున పోటీచేసిన కుడిపూడి ఇపుడు వైసీపీ ఎంఎల్సీగా ఉన్నారు. నియోజకవర్గంలో ఎస్సీలతో పాటు కాపులు, బీసీలు అంటే శెట్టి బలిజలు కూడా బాగానే ఉన్నారు. కాబట్టి వచ్చేఎన్నికల్లో కూడా కచ్చితంగా గెలుస్తానని పొన్నాడ గట్టి నమ్మకంతో ఉన్నారు. మరి చివరకు ఏమవుతుందో చూడాలి.