బొత్సకు పోటీ ఎవరు? వెతుకుతున్న బాబు

వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలిచి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అధికారం చేప‌ట్టాల‌నే ప‌ట్దుద‌ల‌తో ఉన్న టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు.. ముందుగా వైసీపీ బ‌లాల‌పై దృష్టి పెట్టిన‌ట్లు క‌నిపిస్తోంది. వైసీపీలోని బ‌ల‌మైన నాయ‌కుల‌ను ఓడిస్తే ప‌ని మ‌రింత సులువు అవుతుంద‌ని బాబు అనుకుంటున్నారు. అందుకే వైసీపీలోని కీల‌క నేత‌ల‌పై ఆయ‌న ఫోక‌స్ పెట్టార‌ని తెలిసింది. ఇందులో భాగంగానే మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌ను ఓడించేందుకు బాబు క‌స‌ర‌త్తులు చేస్తున్న‌ట్లు స‌మాచారం. కానీ అది అనుకున్నంత సులువేమీ కాదు.

బొత్స స‌త్య‌నారాయ‌ణ‌కు ఉత్త‌రాంధ్ర‌లో ప్ర‌ముఖ బీసీ నాయ‌కుడిగా పేరుంది. సుదీర్ఘ రాజ‌కీయ జీవితంలో ఆయ‌న ఖాతాలో విజ‌యాలే ఎక్కువ‌. విజ‌య‌న‌గ‌రం జిల్లాలో ఆయ‌న‌కు తిరుగులేదు. 1999లో బొబ్బిలి నుంచి ఎంపీగా గెలిచారు. 2004, 2009లో వ‌రుస‌గా చీపురుప‌ల్లి ఎమ్మెల్యేగా విజ‌యాలు సాధించారు. గ‌త ఎన్నిక‌ల్లోనూ 2019లో చీపురుప‌ల్లి నుంచి గెలిచి మంత్రిగా కొన‌సాగుతున్నారు. ఇలాంటి నాయ‌కుడిని చీపురుప‌ల్లిలో ఓడించాలంటే టీడీపీకి స‌రైన అభ్య‌ర్థి కావాలి.

నిజానికి చీపురుప‌ల్లి ఒక‌ప్పుడు టీడీపీకి కంచుకోట అనే చెప్పాలి. 1999 వ‌ర‌కూ అక్క‌డ ఆ పార్టీదే ఆధిప‌త్యం. కానీ ఆ త‌ర్వాతే ప‌రిస్థితులు మారాయి. 2014లో కిమిడి మృణాళిని చేతిలో బొత్స ఓడారు. కానీ ఇప్పుడా ప‌రిస్థితులు అక్క‌డ లేదు.

ఎవ‌రొచ్చినా బొత్స జోరు ముందు తేలిపోతున్నారు. అందుకే ఈ సారి బ‌ల‌మైన అభ్య‌ర్థిని బ‌రిలో దింపాల‌ని బాబు వెతుకుతున్నారు. ఇక్క‌డ మాజీ మంత్రి కిమిడి మృణాళిని త‌న‌యుడు నాగార్జున చీపురుప‌ల్లి టీడీపీ ఇంఛార్జీగా ఉన్నారు. కానీ బొత్స‌ను ఎదుర్కొనే విష‌యంలో నాగార్జున సామ‌ర్థ్యాలు స‌రిపోతాయా అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌. బొత్స ఎత్తుల‌కు అంద‌కుండా పై ఎత్తులు వేసి ఎన్నిక‌ల్లో గెలిచే మొన‌గాడు కావాలన్న‌ది బాబు కోరిక‌. కానీ బాబు ఎంత‌గా వెతికినా అలాంటి నాయ‌కుడు దొర‌క‌డం లేద‌ని తెలిసింది.