టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత రాజకీయ వైరం ఇప్పుడుందని టాక్. తాజాగా పుంగనూర్‌లో అడుగుపెట్టకుండా బాబును పెద్దిరెడ్డి అడ్డుకున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మరోవైపు లోకేష్ యువగళం పాదయాత్ర కూడా పుంగనూరులోకి రాకుండా పక్క నుంచి వెళ్లిపోవడానికి కూడా పెద్దిరెడ్డే కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బాబు సొంత జిల్లా చిత్తూరులో టీడీపీ అనేదే లేకుండా చేయాలని పెద్దిరెడ్డి ప్రయత్నిస్తున్నారు. అయితే బాబు, పెద్దిరెడ్డి మధ్య ఈ రాజకీయ వైరం కాలేజీ రోజుల నుంచే ఉంది.
బాబు, పెద్దిరెడ్డి ఎస్వీ యూనివర్సిటీలో చదివారు. ఈ ఇద్దరూ అక్కడి నుంచే రాజకీయ జీవితం ప్రారంభించారు. ఆ యూనివర్సిటీలో పెద్దిరెడ్డి కంటే బాబు ఏడాది సీనియర్. అయితే బాబు ఎకనామిక్స్, పెద్దిరెడ్డి సోషియాలజీ స్టూడెంట్లు. ఎస్వీయూలో అప్పుడు కమ్మ, రెడ్డి సామాజిక వర్గాల మధ్య పోరు జరిగేదని తెలిసింది. ఎస్వీయూ ఛైర్మన్ పదవి కోసం ఈ రెండు వర్గాలు పోటీపడేవి. అయితే బాబు మాత్రం ఆ పదవి దక్కించుకోలేకపోయారు. 1974లో కేవలం ఎకనామిక్స్ విభాగం ఛైర్మన్‌గా మాత్రమే ఎన్నికయ్యారు. కానీ 1975లో పెద్దిరెడ్డి ఎస్వీయూ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. అప్పుడు ఎస్వీయూలో రీసెర్ఛ్ స్కాలర్గా బాబు జాయిన్ అయ్యారు.
మాజీ రాష్ట్రపతి, దివంగత నీలం సంజీవరెడ్డి ఎంపీగా గెలవడం కోసం విద్యార్థి నాయకుడిగా పెద్దిరెడ్డి చాలా కష్టపడ్డారు. అందుకే జనతా పార్టీ తరపున పీలేరులో పెద్దిరెడ్డికి టికెట్ ఇప్పించారు. కానీ కాంగ్రెస్ (ఐ) అభ్యర్థి చేతిలో పెద్దిరెడ్డి ఓడిపోయారు. మరోవైపు కాంగ్రెస్ (ఐ) నుంచి చంద్రగిరిలో పోటీచేసిన చంద్రబాబు జనతా పార్టీ అభ్యర్థిపై గెలిచారు. దీంతో బాబు, పెద్దిరెడ్డి మధ్య వైరం మరింత ముదిరింది. ఇలా కాలేజీలో మొదలైన వీళ్ల రాజకీయ శత్రుత్వం ఇప్పటికీ కొనసాగుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.