రుణమాఫీ ఫీవర్ పెరిగిపోతోందా ?

కేసీయార్ లో రైతు రుణమాఫీ ఫీవర్ పెరిగిపోతోంది. రైతులకు చేయాల్సిన సుమారు రు. 20 వేల కోట్ల రుణ మాఫీ చేయాలని కేసీఆర్ డిసైడ్ చేశారు. ఆ మేరకు నెలాఖరులోగా మొత్తం రుణమాఫీ జరిగిపోవాలని డెడ్ లైన్ కూడా ప్రకటించేశారు. కేసీయార్ది ఏముంది ఎంతైనా ప్రకటించేస్తారు, ఎలాగైనా ప్రకటిస్తారు. కానీ ప్రకటనలకు తగ్గట్లుగా, ఆదేశాలకు అనుగుణంగా ఖజానాలో నిధులుండాలి కదా. 2018 లో రైతు రుణమాఫీ ప్రకటించినపుడూ ఖజానాలో నిధులు లేవు. వెంటనే రుణాలన్నీ మాఫీ చేసేయాలని ఆదేశించినపుడూ ఖజానాలో నిధులు లేవు.

ఇపుడు సమస్యంతా ఉన్నతాధికారుల మెడకు చుట్టుకుంది. రుణమాఫీ చేయాల్సిన రు. 20 వేల కోట్లను సమీకరించాల్సిందే అని కేసీయార్ ఉన్నతాధికారుల నెత్తిన కూర్చున్నారు. దాంతో రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, ఎక్సైజ్ తదితర ఆదాయార్జన శాఖల ఉన్నతాధికారులు పరుగులు పెడుతున్నారు. పనిలోపనిగా కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లులను కూడా నిలిపేయాలని ఆర్ధికశాఖ ఉన్నతాధికారులకు ఆదేశాలు అందాయట. గురువారం నుండే రుణమాఫీ ప్రారంభమైంది. 45 వేలమంది రైతులకు రుణమాఫీ జరగాల్సుంది.

ఇపుడు కేసీఆర్ ముందున్న లక్ష్యం ఏమిటంటే ఎలాగైనా సరే రు. 20 వేల కోట్లు సమీకరించటమే. కోకాపేట తదితర ఖరీదైన ప్రాంతాల్లో భూములను వేలంవేసి అమ్మటం కూడా నిధుల సమీకరణలో భాగమే. ఇపుడు గనుక రైతు రుణమాఫీ చేయకపోతే రేపటి ఎన్నికల్లో కేసీయార్ ప్రభుత్వానికుంటుంది అసలు సమస్య. రుణమాఫీ అమలు కాకపోవడంతో రైతుల అవస్థలు మామూలుగా లేవు. ప్రభుత్వం రుణమాఫీ చేయకపోవడంతో బ్యాంకులు రైతులకు కొత్త రుణాలు ఇవ్వడం లేదు.

దాంతో లక్షలాది మంది రైతుల బతుకులు అన్యాయమైపోయాయి. మరా కోపమంతా రైతులు ఎవరిమీద చూపించాలి ? ముందుగా ప్రతిపక్షాలకు భయపడే అసెంబ్లీ సమావేశాలకు ముందురోజు రుణమాఫీ చేయబోతున్నట్లు అందుకు డెబ్ లైన్ విధించినట్లు కేసీఆర్ ప్రకటించారు. ప్రతిపక్షాలు పదేపదే ఒత్తిడిపెడుతుంటే, అసెంబ్లీ సమావేశాల్లో సమాధానం చెప్పలేకే రుణమాఫీ అంశంపై కేసీయార్ సడెన్ గా డెడ్ లైన్ ప్రకటించారు. ఒకవేళ ఇవన్నీ డ్రామాలే అయితే అసెంబ్లీ సమావేశాలను, ప్రతిపక్షాలను తప్పించుకోవచ్చు. రేపటి ఎన్నికల్లో ప్రచారం సందర్భంగా రైతుల నిరసనలను కేసీయార్ ఎలా తప్పించుకుంటారు ?