బాబు సొంత జిల్లాలో.. మ‌ళ్లీ టీడీపీలోకి ఆ మాజీ ఎమ్మెల్యే?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మ‌రో ఏడాది లోపే ఎన్నిక‌లు జ‌రిగే అవ‌కాశ‌ముంది. దీంతో ప్ర‌ధాన పార్టీల‌తో పాటు నాయ‌కులు కూడా త‌మ‌దైన వ్యూహ, ప్ర‌తివ్యూహాల్లో మునిగిపోయారు. మ‌రోవైపు వివిధ కార‌ణాల‌తో రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటున్న నాయ‌కులు కూడా తిరిగి పార్టీల్లోకి వ‌చ్చేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇలాంటి ప‌రిస్థితే ఇప్పుడు టీడీపీ అధినేత చంద్ర‌బాబు సొంత జిల్లా చిత్తూరులో క‌నిపిస్తోంది. చిత్తూరు నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఏఎస్ మ‌నోహ‌ర్‌.. తిరిగి పార్టీలో యాక్టివ్ కావాల‌ని చూస్తున్న‌ట్లు తెలిసింది.

రాష్ట్రవ్యాప్తంగా నియోజ‌క‌వ‌ర్గాల స‌మీక్ష‌లు చేస్తూ బాబు ప‌రిస్థితిని అంచ‌నా వేస్తున్నారు. కానీ సొంత జిల్లా చిత్తూరులో మాత్రం నియోజ‌క‌వ‌ర్గాలు త‌ల‌నొప్పి క‌లిగిస్తున్నాయ‌ని తెలిసింది. ముఖ్యంగా చిత్తూరు నియోజ‌క‌వ‌ర్గంలో ఇప్ప‌టివ‌ర‌కూ టీడీపీ ఇంఛార్జీని నియ‌మించ‌లేదు. ఈ క్ర‌మంలో ఏఎస్ మ‌నోహ‌ర్ మ‌ళ్లీ టీడీపీలోనే చేరి నియోజ‌క‌వ‌ర్గ బాధ్య‌త‌లు చేప‌ట్టాల‌ని చూస్తున్న‌ట్లు స‌మాచారం. 2004లో ఇదే చిత్తూరు నుంచి మ‌నోహర్ ఎమ్మెల్యేగా గెలిచారు. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత 2014లో డీకే స‌త్య‌ప్ర‌భ టీడీపీ నుంచి పోటీచేసి విజ‌యం సాధించారు. 2019లో మ‌ళ్లీ మ‌నోహ‌ర్‌కే టికెట్ ఇచ్చినా ఆయ‌న ఓడిపోయారు. ఆ త‌ర్వాత రాజ‌కీయాల నుంచి దూరంగా ఉంటున్నారు.

ఇప్పుడు ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతుండ‌డంతో మ‌నోహ‌ర్ మ‌ళ్లీ యాక్టివ్ కావాల‌ని చూస్తున్న‌ట్లు తెలిసింది. ఈ నేప‌థ్యంలోనే చిత్తూరులో అభిమానుల‌తో ఆత్మీయ స‌మావేశం ఏర్పాటు చేశారు. అభిమానులు, కార్య‌క‌ర్త‌లు నిర్ణ‌యం మేర‌కే న‌డుచుకుంటాన‌ని ఆయ‌న అన్నారు. త‌న రాజకీయ జీవితానికి ఎన్టీఆర్‌, చంద్ర‌బాబే కార‌కుల‌ని చెప్పారు. దీంతో మ‌నోహ‌ర్ మ‌ళ్లీ టీడీపీలోకి రీ ఎంట్రీ ఇవ్వ‌నున్నార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో చిత్తూరు నుంచి పోటీ చేయాల‌ని ఆయ‌న చూస్తున్న‌ట్లు స‌మాచారం.